రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్ 21 యుద్ధవిమానం

రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్ 21 యుద్ధవిమానం

భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధవిమానం శిక్షణ సమయంలో రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. గురువారం సాయంత్రం ట్విన్ సీటర్ మిగ్ 21 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ కోసం ఉతర్లై ఎయిర్ బేస్ నుంచి బయలుదేరగా..రాత్రి 9.10 నిమిషాలకు ప్రమాదానికి గురైనట్లు ఎయిర్ఫోర్స్ ప్రకటించింది. మృతి చెందిన పైలట్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపింది. విమానం కూలిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్  వీఆర్  చౌదరితో మాట్లాడి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన..పైలట్ల సేవను దేశం ఎప్పుడూ మరిచిపోదంటూ ట్వీట్ చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు తెలిపారు.మిగ్ 21 అనేది సోవియట్ కాలం నాటి సింగిల్ ఇంజిన్ గ్రౌండ్ ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఒకప్పుడు ఐఏఎఫ్ ఫ్లీట్ కు వెన్నముకగా ఉండేంది. అయితే ఇది పేలవమైన భద్రతా రికార్డును కలిగివుండగా..వచ్చే ఏడాది దీనిని సర్వీస్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. మిగ్-21 స్థానంలో అత్యాధునిక ఫైటర్లను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.