అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ ఓటర్లే కీలకం

అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ ఓటర్లే కీలకం

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ ఓటర్లే కీలకం కానున్నారు. మిచిగన్, పెనిసిల్వేనియా, విస్కాన్సిన్ వంటి అనేక రాష్ట్రాల్లో ఇండియన్ ఓటర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని, వీరే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని డెమొక్రటిక్ పార్టీ టాప్ లీడర్లు చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్య, ఓటమికి తగ్గిన మెజారిటీని వారు లెక్కలతో సహా వివరిస్తున్నారు.

8 రాష్ట్రాల్లో మనోళ్లదే హవా..

యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ గా భావించే మిచిగన్, పెనిసిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఇండియన్ అమెరికన్ ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉందని నేతలు చెప్తున్నారు. ఈ 8 రాష్ట్రాల్లో మొత్తంగా 13 లక్షల మంది ఇండియన్ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. ‘‘మిచిగన్ స్టేట్ లో 1.25 లక్షల ఇండియన్ అమెరికన్ ఓటర్లు ఉన్నారు. మేం 2016లో ఇక్కడ 10,700 ఓట్ల తేడాతో ఓడిపోయాం’’ అని శనివారం ఓ కార్యక్రమంలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీ చైర్మన్ థామస్ పెరెజ్ చెప్పారు. ‘‘పెన్సిల్వేనియాలో 1.56 లక్షల ఇండియన్ అమెరికన్ ఓటర్లున్నారు. మేం 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. అలాగే విస్కాన్సిన్ లో 37 వేల ఇండియన్ అమెరికన్ ఓట్లున్నాయి. మేం 21 వేల ఓట్ల తేడాతో లాస్ అయ్యాం’’ అని పెరెజ్ వివరించారు. 2020 ఎలక్షన్లలోనూ ఇండియన్ అమెరికన్, ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ఐలాండ్స్ ఓటర్లే విజేతను నిర్ణయించే చాన్స్ ఉందని ఆయన అన్నారు. 2016లో 77 శాతం ఇండియన్ అమెరికన్ ఓటర్లు హిల్లరీకి అనుకూలంగా ఓటేశారని, ఇప్పుడు ట్రంప్ కన్నా ఆయన ప్రత్యర్థి బిడెన్ వైపే ఇండియన్ అమెరికన్ లు మొగ్గు చూపే చాన్స్ ఉందని ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. అయితే, మిచిగన్, ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి పలు రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఇండియన్ అమెరికన్ లు భారీ ఎత్తున రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారని, వారు ట్రంప్ కే ఓటేసే చాన్స్ ఉందని పలు సర్వేలు చెప్తున్నాయి.