- ‘ఆర్మీ యూనిఫామ్స్ 2026 పాంప్లెట్’ విడుదల
న్యూఢిల్లీ: జవాన్లకు ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్ కోడ్‌ను ప్రకటించింది. బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన గుర్తులు, పదాలను తొలగించింది. సైనిక సంప్రదాయాలను భారతదేశ సార్వభౌమత్వ గుర్తింపునకు అనుగుణంగా మార్చే ప్రయత్నంలో భాగంగా.. భారత సైన్యం పౌర అధికారిక దుస్తులలో (సివిల్ ఫార్మల్ డ్రెస్) స్వదేశీ ‘బండి జాకెట్’ను చేర్చింది. అలాగే పూర్వకాలం నాటి ‘రాయల్’ వంటి పదాల వాడకాన్ని కూడా రద్దు చేసింది.
రివ్యూయింగ్ ఆఫీసర్లు తప్పనిసరిగా కత్తులు ధరించాలనే నిబంధనను ఆప్షనల్‌గా మార్చింది. కొన్ని మెస్ దుస్తులతో పాటు పౌచ్ బెల్ట్‌లను ఉపయోగించడాన్ని కూడా రద్దు చేసింది. ఆర్మీ యూనిఫామ్ కోడ్‌లో చేసిన ఈ మార్పులను కొత్తగా జారీ చేసిన ‘ఆర్మీ యూనిఫామ్స్-2026 పాంప్లెట్(సైనిక దుస్తుల కరదీపిక)’లో పొందుపరిచారు. ఈ మార్పుల వెనుక ఉన్న కారణాన్ని ‘స్వదేశీకరణ, జాతీయ భావాలతో అనుసంధానం’ అనే అధ్యాయంలో వివరించారు.
దేశ సెంటిమెంట్లు, సార్వభౌమత్వ గుర్తింపునకు అనుగుణంగా.. ఆర్మీ యూనిఫామ్స్ పాంప్లెట్ ప్రస్తుత ఎడిషన్‌లో మార్పులను చేర్చినట్టు పేర్కొంది. తాజా మార్పులలో భాగంగా.. క్లోజ్డ్-నెక్ కోట్(మెడ వరకు మూసి ఉండే కోటు. దీనినే బండి జాకెట్ అని పిలుస్తారు), పూర్తి చేతుల చొక్కా (ఫుల్ స్లీవ్ షర్ట్), దానికి సరిపోయే ఫార్మల్ ట్రౌజర్స్, బూట్లతో కలిపి ధరించాల్సి ఉంటుంది.
