రోబోట్స్ వైపే ఇండియన్ కంపెనీల ఫోకస్

రోబోట్స్ వైపే ఇండియన్ కంపెనీల ఫోకస్

బెంగళూరుఅచ్చం మనిషిలానే పనిచేస్తూ… చెప్పినట్టు వింటూ.. పది మంది చేసే పనిని  తాను ఒక్కటే పూర్తి చేస్తూ… సమయాన్ని వృధా కానీయని రోబోట్స్‌‌ వైపే  ఇండియన్ కంపెనీలన్నీ ఫోకస్ చేస్తున్నాయి. బడా బడా కంపెనీలన్నీ వర్కర్లను తగ్గించేసి.. రోబోట్ల బాట పడుతున్నాయి. టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకి ఇలా ఒక్కటేమిటీ.. చాలా కంపెనీలు కూడా తమ ఫ్యాక్టరీల్లో రోబోట్స్ సేవలు ఉపయోగించుకుంటున్నాయి. టాటా మోటార్స్ యూనిట్ టీఏఎల్ మానుఫాక్చరింగ్ సొల్యుషన్స్ లిమిటెడ్‌‌… ‘బ్రావో రోబోట్’ అనే మేడిన్ ఇండియా ఇండస్ట్రియల్ రోబోట్‌‌ను రూపొందించింది. ఈ రోబోట్‌‌ 10 కేజీల బరువులను అలవోకగా మోయగలదు. ఎం అండ్ ఎం కూడా నాసిక్‌‌లోని తన ఫ్యాక్టరీలో ‘రోబోటిక్ వెల్డ్ లైన్‌‌’ను ప్రవేశపెట్టింది. ఆ రోబోట్‌‌ ఎం అండ్ ఎం ఫ్యాక్టరీలో సమర్ధంగా తన సేవలనందిస్తోంది. టాటా మోటార్స్, గోద్రెజ్, వెల్‌‌స్పన్‌‌ ఇలా చాలా కంపెనీలు ఇంటెలిజెంట్ ప్లాంట్ ఫ్రేమ్‌‌వర్క్‌‌తో తమ అవసరాలను తీర్చుకుంటున్నాయి. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌‌ మానేసర్, గూర్గావ్‌‌ ఫ్యాక్టరీల్లో కూడా రోబోట్స్‌‌ పనిచేస్తున్నాయి. ఒక్క మానేసర్‌‌‌‌ ప్లాంట్‌‌లోనే  రెండు వేలకు పైగా రోబోట్స్‌‌ వర్క్ చేస్తున్నాయన్నంటే అతిశయోక్తి కాదు.

ఇండియాలో, ప్రపంచంలో ఇప్పుడు చాలా వరకు కంపెనీలు తమ ఫ్యాక్టరీల్లో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్‌‌సీ) మిషన్లను వాడుతున్నాయి. ఈ మిషన్లు స్మార్ట్‌‌ బోర్డు ద్వారా మినీ కంప్యూటర్‌‌‌‌లోకి సందేశాలు పంపించి ప్రొగ్రామ్‌‌ను ఫీడ్ చేస్తాయి. మిషన్‌‌లో అవసరమైన టూల్స్‌‌ను లోడ్ చేసిన అనంతరం, ఆటోమేటిక్‌‌గా అది రన్‌‌ అవుతుంది. కానీ తర్వాత రాబోతున్న ఆటోమేషన్‌‌ మరింత అడ్వాన్స్‌‌ స్టేజీలో ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోతున్న మార్పులు ఇండియన్‌‌ లేబర్ ఫోర్స్‌‌లో పెద్ద ఎత్తున ప్రభావం చూపనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆటోమేటివ్, టెక్స్‌‌టైల్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్‌‌లో  రోబోట్స్‌‌ వినియోగంతో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. అత్యధికంగా ఉన్న ఉద్యోగులను తొలగించడానికి కూడా ఈ రోబోట్స్  ఒక అవకాశంలా కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాయి.

డిజిటల్ ఫ్యాక్టరీలు కొన్ని….

ఆంధ్రప్రదేశ్‌‌లోని శ్రీ సిటీలో ఉన్న మాండెలెజ్ ఇండియా యూనిట్‌‌కు ‘ఇంటిగ్రేడెట్ డిజిటల్ ఫ్యాక్టరీ’ ఉంది. ఇది నిమిషానికి 6,300 చాకోలెట్ బార్లను ప్యాక్ చేస్తోంది. జైపూర్ వాచ్ కో.. 3డీ ప్రింటెడ్‌‌తో స్టీల్ వాచెస్‌‌ కలెక్షన్స్‌‌ను రూపొందిస్తోంది. అమెజాన్ వేర్‌‌‌‌హౌస్‌‌లలో కూడా ఏఐతో నడిచే మల్టి రోబోట్ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సిస్టమ్ ఉంది. టెక్ మహింద్రా గ్రూప్ కంపెనీ కూడా తన హెచ్‌‌ఆర్‌‌‌‌ రోబోట్‌‌ను కూడా తీసుకొచ్చింది. తొలుత ఉత్తరప్రదేశ్‌‌లో హెచ్‌‌ఆర్‌‌‌‌ సేవలందించే రోబోట్‌‌ను తెచ్చిన మహింద్రా.. తన రెండో హెచ్‌‌ఆర్‌‌‌‌ రోబోట్‌‌ను ఈ ఏడాది మేలో హైదరాబాద్‌‌ క్యాంపస్‌‌లో లాంచ్ చేసింది. దాని పేరు క్రిస్టెన్డ్ కే2. ఈ కే2 హెచ్‌‌ఆర్‌‌‌‌కు సంబంధించిన అన్ని పనులను పేస్లిప్‌‌లు, ట్యాక్స్ ఫామ్‌‌లను ఇవ్వడం వంటివాటిని చేస్తోంది. అయితే ఏఐను ఫ్యాక్టరీల్లో ప్రవేశపెట్టడానికి భారీ ఎత్తున క్యాపిటల్ అవసరం పడుతుంది. కానీ దాని రిటర్న్‌‌లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయని ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్నారు. స్పాట్ వెల్డింగ్ రోబోట్ ధరలు కూడా 2025 నాటికి 22 శాతం తగ్గనున్నాయని టాక్.

మూడింతలు పెరిగిన రోబోట్స్..

ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న రోబోట్స్‌‌ సంఖ్య గత రెండు దశాబ్దాల్లో మూడింతలు పెరిగి 22.5 లక్షలకు చేరుకుందని ఆక్స్‌‌ఫర్డ్ ఎకనామిక్స్  2019 జూన్ రిపోర్ట్‌‌లో తెలిపింది. వచ్చే 20 ఏళ్లలో ఈ రోబోట్స్ సంఖ్య మరింత పెరగనుంది. 2030 నాటికి 2 కోట్లకు చేరుకుంటుందని, కేవలం చైనాలోనే 1.4 కోట్ల రోబోట్స్ ఉంటాయని ఈ రిపోర్ట్ అంచనావేస్తోంది. ఇండియాలో ఇండస్ట్రియల్ రోబోట్స్‌‌కు ముఖ్యమైన కస్టమర్‌‌‌‌గా ఆటోమోటివ్ సెక్టార్ ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ చెబుతోంది. మొత్తం సప్లయిలో 62 శాతం వాటా ఈ రంగానిదేనని పేర్కొంది. కొత్తగా ఫ్యాక్టరీల్లోకి తీసుకునే రోబోట్స్‌‌…మామూలు వర్కర్ల కంటే ఎక్కువ సామర్ధ్యంతో పనిచేయడం విశేషం. ఇండియా 1980, 90 దశకాలలో బస్సు తయారీని చేపట్టలేకపోయింది. కానీ ఆ తర్వాత వేగంగానే టెక్నాలజీని అందిపుచ్చుకుని  బస్సుల తయారీలో ముందడుగు వేసింది. ఇండస్ట్రియల్ ఐఓటీ, ఏఐ, 3డీ ప్రింటింగ్ మీదే ఇప్పుడు గ్లోబల్‌‌ కంపెనీలన్నీ నడుస్తున్నాయి. ఇవి గ్లోబల్‌‌ ప్రొడక్షన్‌‌ను పూర్తి స్థాయిలో మార్చేశాయి. చిన్న ఫ్యాక్టరీ అనేది ఫ్యూచర్ విజన్‌‌లా కాకుండా.. నాలుగవ ఇండస్ట్రియల్ రివల్యూషన్‌‌కు గుండెకాయలాగా ఉందని ఒక గ్లోబల్ స్మార్ట్ ఫ్యాక్టరీ లీడర్ తన బ్లాగ్‌‌లో పేర్కొన్నారు. సంప్రదాయ తయారీ, ఇండస్ట్రియల్ పద్ధతులు డిజిటల్ టెక్నాలజీస్‌‌తో కలిసి పనిచేయడమే నాలుగవ ఇండస్ట్రియల్ రివల్యూషన్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ సాఫ్ట్‌‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, అడ్వాన్స్డ్‌‌ సెన్సార్ టెక్నాలజీస్, 3డీ ప్రింటింగ్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డేటా ఎనలటిక్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలన్నీ గ్లోబల్‌‌గా, ఇక్కడా మంచి ఫలితాలను సాధిస్తున్నాయని కూడా ఫ్యాక్టరీ లీడర్స్‌‌ చెబుతున్నారు.