రాత్రిపూటా సోలార్​ పవర్

రాత్రిపూటా సోలార్​ పవర్

సోలార్​ కరెంట్​.. సూర్యుడున్నప్పుడు మాత్రమే తయారవుతుంటుంది. రాత్రిపూట కరెంట్​ తయారు కాదు. మరి, ఆ రాత్రి కూడా సోలార్​ పవర్​ తయారైతే ఎట్లుంటది? సూపర్​ కదూ! దాన్ని సాధ్యం చేసి చూపించారు అశ్వత్​ రమణ్​ అనే ఇండియన్​ సైంటిస్టు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియాలో పనిచేస్తున్న ఆయన, రాత్రి కూడా కరెంట్​ను తయారు చేసేలా సోలార్​ పానెళ్లకు మరింత శక్తినిచ్చే ఓ పరికరాన్ని కనిపెట్టారు. దాన్ని థర్మోఎలక్ట్రిక్​ జనరేటర్​గా పిలుస్తున్నారు. దాన్ని స్టాన్​ఫోర్డ్​, కాలిఫోర్నియా యూనివర్సిటీల రూఫ్​టాప్​లపై పరీక్షించారు. అందులో సక్సెస్​ అయ్యారు. ఈ పరికరంలో పాలీస్టైరీన్​ షెల్​ ఉంటుంది. దానిపై రేడియేషన్​ ప్రభావం ఉండకుండా అల్యూమినియం రేకుతో కవరింగ్​ చేశారు.

వాతావరణంలోని వేడిని తీసుకుని రాత్రిపూట ఆకాశంలోకి పంపించేలా ఆ పరికరానికి ఓ నల్లటి ఎమిటర్​ను పెట్టారు. ఆ పరికరం పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు ఓ టేబుల్​పై పెట్టారు. పరికరానికి ఓ ఎల్​ఈడీ బల్బును అటాచ్​ చేశారు. దాంతోపాటు వోల్టేజ్​ బూస్టర్​ కన్వర్టర్​నూ అటాచ్​ చేశారు. బల్బును పరికరం వెలిగించింది. ఆరు గంటల్లో 25 మిల్లీ వాట్ల కరెంట్​ను తయారు చేసింది. ప్రస్తుతం ఇది చిన్న సైజులో తయారు చేసిన పరికరమేనని, పెద్ద సైజుల్లో తయారు చేస్తే ఫలితాలు మరింత మంచిగా వస్తాయని రమణ్​ చెబుతున్నారు.