- అర్జెంటినా చేతిలో 1 - 2 తేడాతో ఓటమి
టోక్యో: ఒలింపిక్స్ లో భారత్ కు మరో నిరాశ. బుధవారం జరిగిన హాకీ సెమీస్ లో అర్జెంటీనా చేతిలో 1 – 2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఇక మిగిలింది మూడో స్థానం కోసం పోరాటమే. ఈ పోరాటంలో భారత్ గెలిస్తే భారత్ కు కాంస్య పతకం దక్కుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో భారత మహిళలు తొలి నుంచి అటాకింగ్ ప్రారంభించి శుభారంభం చేశారు.
మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే గోల్ సాధించడంతో హుషారెత్తిపోయారు. అయితే ఇదే ఆధిక్యాన్ని.. అటాకింగ్ ను కొనసాగించడంలో తడబడ్డారు. డిఫెన్స్ లో బలహీనంగా ఉండడాన్ని గుర్తించిన అర్జెంటీనా 18వ నిమిషంలో గోల్ చేసి స్కోర్ సమానం చేసింది. అదే ఊపును కొనసాగిస్తూ 36వ నిమిషంలో మరో గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. అర్జెంటీనా ఆధిక్యాన్ని సమం చేయడం కోసం భారత జట్టు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ హైఓల్టేజి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్ పై నే ఆశలు పెట్టుకోవాల్సి వచ్చింది. మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు కాంస్య పతకం దక్కుతుంది.

