పండ్లు తినడంలో వెనుకబడ్డ ఇండియన్లు

పండ్లు తినడంలో వెనుకబడ్డ ఇండియన్లు

ధరలు ఎక్కువగా ఉండటమే కారణం

రోజుకు కనీసం 100 గ్రాములు తినాలంటే.. మనోళ్లు 32 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారట

వెస్ట్‌‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువ ధరలు

రసాయనాలతో టేస్ట్‌‌ కూడా తగ్గుతోంది

కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ధరలు తగ్గే అవకాశం

బిజినెస్ డెస్క్, వెలుగు:  ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ తినే ఆహారంలో ఫ్రూట్స్ ఉండాలంటారు. కానీ ఫ్రూట్స్ తినడంలో ఇండియన్లు చాలా వెనుకపడ్డారట. రోజుకు 100 గ్రాముల ఫ్రూట్స్ తినాలని హెల్త్ ఎక్స్‌‌పర్ట్‌‌లు రికమండ్ చేస్తే.. మనవాళ్లు కేవలం 32 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని ఎన్‌‌ఐఎన్–ఐసీఎంఆర్ రిపోర్ట్‌‌లో వెల్లడైంది. ఇతర దేశాలతో పోలిస్తే మన ఇండియన్లు చాలా తక్కువగా ఫ్రూట్స్ తింటున్నారని హిందూస్తాన్ యూనిలివర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఐఐ ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ కో చెయిర్ సుధీర్ సీతాపతి కూడా చెప్పారు. ఇంత తక్కువ తినడానికి కారణం ఇండియాలో ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు.

వెస్ట్‌‌తో పోలిస్తే ఇండియాలో ఫ్రూట్స్ కాస్ట్ 20 శాతం ఎక్కువగా ఉందని సీతాపతి తెలిపారు. దీంతో పేద ప్రజలు ఎప్పుడో ఒకసారి తప్ప ప్రతి రోజూ ఫ్రూట్స్‌‌ను తినడం లేదన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ఫార్మింగ్ సిస్టమ్‌‌లో మరింత స్థిరత్వం తెచ్చి రేట్లను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఫ్రూట్స్ ధరలు చాలా ఇన్‌‌స్టెబులిటీగా(హెచ్చుతగ్గులు) ఉంటాయి. సీజన్ బట్టి వీటి ధరలు మారుతుంటాయి. అంతేకాక వీటిని స్టోర్ చేసే స్కోప్ లేకపోవడం కూడా ధరలు పెరిగేందుకు కారణంగా నిలుస్తోంది. ఇవన్నీ ఇండియన్లు ఫ్రూట్స్ తినేందుకు అడ్డంకిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త అగ్రికల్చర్ బిల్లు కాంట్రాక్ట్ ఫార్మింగ్‌‌ను పెంచుతుందని, దీంతో ఫ్రూట్స్ ధరలు కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ధరలు తగ్గితే ఫ్రూట్స్ కన్జంప్షన్ కచ్చితంగా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ధర తగ్గితే కొంటారు..

ఫ్రూట్స్ అత్యంత ఎక్కువ మంది కోరుకునే ఫుడ్స్‌‌లో ఒకటి. న్యూట్రియంట్స్‌‌తో ఇవి ప్యాక్ కావడం వల్ల అందరూ వీటిని తినేందుకు ఇష్టపడతారు. మాంసం మాదిరిగా కాకుండా.. ఫ్రూట్స్‌‌ను మొక్కల ద్వారా పండించడం వల్ల దీన్ని అవైడ్ చేసే ఉద్దేశ్యం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఫ్రూట్స్‌‌ను ఇష్టంగా తినడమే తప్ప.. తప్పనిసరిగా ప్రతి రోజూ ఆహారంలో ఫ్రూట్స్‌‌ను తీసుకోవాలనుకునే వారు చాలా తక్కువగా ఉంటారు. ధరల విషయంలో  ఫ్రూట్స్‌‌ను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తే.. అప్పుడు తినడం ప్రారంభిస్తారని సీతాపతి భావిస్తున్నారు. గ్రామాల్లో సీజన్ బట్టి ఆయా ఫ్రూట్స్‌‌ను తింటూ ఉంటారు. కానీ అర్బన్ సెంటర్లలో అలా ఉండదు. మార్కెట్‌‌ప్లేసెస్‌‌లో ఏమీ దొరికితే అవే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాక చాలా మంది తాజాగా ఉండే ఫ్రూట్స్‌‌ను కోరుకుంటారు. వాడిపోయిన వాటిని తినడానికి ఇష్టం చూపించరు. కానీ సిటీల్లో ఉండే కన్జూమర్లు పంటలకు దూరంగా ఉండటం వల్ల తాజా పండ్లను అందుకోలేకపోతున్నారు. దీంతో పండ్లను పండించే రైతుల పరిస్థితి డైలమాలో పడుతోంది. ఫ్రూట్స్ తినే విషయంలో ఇప్పటి వరకున్న అపోహలన్ని ఇప్పుడిప్పుడే పోతున్నాయి. క్వాలిటీ లేని వెజిటేబుల్స్‌‌ను, మాంసాన్ని  వండితే వాటిలో ఉన్న క్రిములు పోతాయని, కానీ ఫ్రూట్స్ విషయంలో అలా ఉండదని చాలా మంది భావిస్తుంటారు. ఫ్రూట్స్ త్వరగా పాడవుతాయని కొనేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు చాలా మంది. పంటకు వచ్చిన ఫ్రూట్స్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్ చేసే సమయంలో దెబ్బతింటాయి. అలాగని పంటకు రాని వాటిని కొనడానికి వీలులేదు. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ తినాలనుకునే వారికి ప్రతికూలంగా నిలుస్తున్నాయి.

టైమ్, స్పేసే అసలైన ఇన్వెస్ట్‌‌మెంట్…

గతంలో ఫ్రూట్స్‌ ను చాలా మంది డైరెక్ట్‌‌గా రైతుల నుంచే కొనేవారు. కానీ ముందుగా రైతులతో మాట్లాడుకుని, ఆ తర్వాత పంటకు వచ్చిన వాటిని ఇంటికి తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్‌‌లా ఉండటం వల్ల, అంతేకాక రేట్లలో కూడా మార్పులు వస్తుండటంతో చాలా మంది ఫ్రూట్స్ జోలికి వెళ్లడం లేదు. ఫ్రూట్స్ విషయంలో అసలైన ఇన్వెస్ట్‌‌మెంట్ డబ్బు కాదు. వాటిని స్టోర్ చేయడానికి అవసరమైన స్పేస్‌‌ను, పాడవకుండా చూసుకునేందుకు సరియైన టైమ్‌ను కేటాయించడం. వాటిని స్టోర్ చేయడంలో కానీ, ఎప్పడికప్పుడు మానిటర్ చేయడంలో కానీ ఏమైనా తేడాలొస్తే మొత్తం పండ్లన్ని ఖరాబు అయిపోతాయి. దీంతో చాలా మంది కూడా ఎంతో కాలంగా నమ్మకం ఉన్న వారి నుంచే పండ్లను కొనుగోలు చేస్తుంటారు.  మరోవైపు సూపర్‌‌‌‌ మార్కెట్లలో ఫ్రూట్స్ చూడటానికి బాగుం టాయి. కానీ వాటి టేస్ట్ చాలా చప్పగా ఉంటున్నాయి. రసాయనాలు వేసి పండిం చడం, వాటిని పాడవుకుండా ఉండేందుకు మళ్లీ రసాయనాలు వాడటం వంటివి వాటి టేస్ట్‌‌ను పోగొడుతున్నాయి. దీంతో ఇండియన్లు సూపర్‌‌‌‌మార్కెట్లలో ఫ్రూట్స్‌‌ను కొనేందుకు కూడా ఇష్టపడటం లేదు.