ఇండియా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఏమీ లేదు: నీతి ఆయోగ్​

ఇండియా ఆర్థిక వ్యవస్థకు  ప్రమాదం ఏమీ లేదు: నీతి ఆయోగ్​
  • చాలా సంపన్న దేశాలు ఇబ్బందిపడుతున్నాయి
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వరకు గ్రోత్​
  • నీతి ఆయోగ్​ వైస్​‑చైర్మన్​ రాజీవ్​ కుమార్​

న్యూఢిల్లీ: కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఇండియా ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నీతి ఆయోగ్​ ప్రకటించింది. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6–-7 శాతం వృద్ధిని సాధిస్తుందని, మాంద్యం రాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ -ఛైర్మెన్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రపంచమార్కెట్లలో సమస్యల వల్ల మన ఎకానమీపై కొంత ప్రభావం ఉందని మాత్రం అంగీకరించారు.

యూఎస్, యూరప్, జపాన్,  చైనాల గ్రోత్​ రేట్ తగ్గిపోతోందని, ఫలితంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. "అదృష్టవశాత్తూ, భారతదేశంలో మాంద్యం ఏర్పడే అవకాశం లేదు.  ప్రపంచ మార్కెట్లలో పరిస్థితుల వల్ల మన వృద్ధి ప్రతికూలంగా ప్రభావితమైనది నిజమే! 2023–-24లో మనం 6–-7 శాతం వృద్ధిని సాధించగలుగుతాం" అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు  భారత ఆర్థిక వ్యవస్థకు 6.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. దాని జూన్ 2022 అంచనాలతో పోలిస్తే ఇది ఒక శాతం తగ్గింది.  

రూపాయి మారక విలువతో ఇబ్బంది లేదు..

సామాన్యులపై  రూపాయి ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు ‘ ‘దిగుమతి చేసుకున్న వస్తువులు లేదా సేవలను సామాన్య జనం ఉపయోగించరు. రూపాయి విలువ ఎలా ఉన్నా వారికి పెద్దగా ఏమీ కాదు. రూపాయి దాని వాస్తవ విలువకు దగ్గరగానే ఉంటేనే మనకు మేలు. తగ్గినా కూడా పెద్ద ప్రమాదాలు ఏవీ జరగవు”అని అన్నారు. శుక్రవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 6  పైసలు తగ్గి  81.74 వద్ద ముగిసింది. వాణిజ్య లోటు గురించి కుమార్ మాట్లాడుతూ, అక్టోబర్‌లో ఎగుమతులు తగ్గాయని,  వస్తువులు,  సేవల ఎగుమతులను పెంచడానికి సరైన విధానం అవసరమని స్పష్టం చేశారు.  

ప్రతి రాష్ట్రానికి -నిర్దిష్ట ఎగుమతి ప్రోత్సాహక విధానాలను రూపొందించాలని కుమార్​ అన్నారు. ‘‘ఉదాహరణకు పంజాబ్​లో విస్తారంగా సాగుభూమి ఉంది. దీనికి శతాబ్దాల వాణిజ్య అనుభవం ఉంది. తమిళనాడు తీరప్రాంత రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు  ఒకే విధానం ఉండటం సరైందని కాదు" అని ఆయన అన్నారు. వాణిజ్య లోటు 26.91 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ,  డిమాండ్ తగ్గుదల కారణంగా అక్టోబర్‌లో భారతదేశ ఎగుమతులు 16.65 శాతం తగ్గి  29.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.