ఇండియన్ టెక్నాలజీతో సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయ్యని జనరేటర్

ఇండియన్ టెక్నాలజీతో సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయ్యని జనరేటర్

ఆఫీసులు, అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో కరెంట్ పోతే ఏం చేస్తాం? డీజిల్ జనరేటర్ ఆన్ చేస్తాం. కానీ దాని వల్ల వచ్చే శబ్దంతో సౌండ్ పొల్యూషన్. పొగ, కాలుష్య కారక వాయువులతో గాలి కాలుష్యమూ వస్తుంది.  అందుకే.. అసలు శబ్దమే చేయని ‘సైలెంట్ జనరేటర్’ను కౌన్సిల్ ఆఫ్​ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సైంటిస్టులు తయారు చేశారు. ఇది పర్యావరణానికి అనుకూలమైన జీవ ఇంధనంతోనే  నడుస్తుంది కాబట్టి కాలుష్యానికి కారణమయ్యే వాయువులను చాలా తక్కువగా మాత్రమే విడుదల చేస్తుంది.  స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన తొలి ఫ్యూయెల్ సెల్ ఇదే కావడం మరో విశేషం. దీనిని సీఎస్ఐఆర్ ఫౌండేషన్ డే సందర్భంగా గురువారం రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే ఆవిష్కరించారు.

డీజిల్ జనరేటర్లకు ప్రత్యామ్నాయం

ఈ ఫ్యూయెల్ సెల్ అందుబాటులోకి వస్తే డీజిల్ జనరేటర్లకు ప్రత్యామ్నాయం అవుతుందని, డీజిల్ అవసరాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుందని సైంటిస్టులు వెల్లడించారు. ఇది డీజిల్ జనరేటర్ల కన్నా 70 శాతం ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, ఇది కరెంట్ తయారు చేసేటప్పుడు నీటి ఆవిరి, వేడిని కూడా విడుదల చేస్తుందని, వీటిని చిన్న చిన్న ఆఫీసుల్లో, ఇండ్లలో మినీ హీటర్లకు కూడా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. సుమారు 5 కిలోవాట్ల సామర్థ్యంతో కరెంట్ తయారు చేసే ఈ ‘హై టెంపరేచర్ ఫ్యూయెల్ సెల్ సిస్టం’ తయారీలో సీఎస్ఐఆర్ కు చెందిన మూడు లేబొరేటరీలతో పాటు పుణేకు చెందిన థర్మాక్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ కూడా పాలు పంచుకుంటోంది.  వచ్చే ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల దీనికి తుది పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ఆ పరీక్షల తర్వాత దీని తయారీకి అయ్యే ఖర్చును తగ్గించడం, అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తెచ్చే స్థాయిలో ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇవన్నీ పూర్తి కాగానే వీటిని మార్కెట్లోకి విడుదల
చేయనున్నారు.

ఫ్యూయెల్ సెల్ అంటే ఏమిటి?

హైడ్రోజన్ వంటి బయో ఫ్యూయెల్స్ నుంచి కరెంట్ తయారు చేసే బ్యాటరీ వంటి పరికరాలనే ఫ్యూయెల్ సెల్స్ అంటారు. మామూలు బ్యాటరీలకు చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాల్సి ఉంటుంది. వీటికి ఆ అవసరం ఉండదు. ఇంధనం, గాలి అందుతున్నంత సేపూ ఇవి కరెంట్ తయారు చేస్తూనే ఉంటాయి. బ్యాటరీలు, ఫ్యూయెల్ సెల్స్ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం ద్వారా కరెంట్ అందిస్తాయి. మిథనాల్, బయో మీథేన్, ఇథనాల్, హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గాల్లోని ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకుని కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేస్తాయి.