- ప్రారంభించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: ముంబైలో మన దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ (సంగీత రహదారి) అందుబాటులోకి వచ్చింది. ముంబై కోస్టల్ రోడ్ లోని నారిమన్ పాయింట్ నుంచి వర్లి వైపు వెళ్లే నార్త్‌బౌండ్ లేన్‌లో 500 మీటర్ల మేర మ్యూజికల్ రోడ్ ఏర్పాటు చేశారు. దీన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మాజీ శివసేన ఎంపీ రాహుల్ షెవాలే (ఈ ఐడియాను కాన్సెప్ట్ చేసిన వ్యక్తి) సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ రోడ్డు ప్రత్యేకత ఏమిటంటే.. వాహనాలు 70 -నుంచి 80 కిమీ వేగంతో వెళ్తే టైర్లు, రోడ్డు ఉపరితలం మధ్య ఘర్షణ ఏర్పడి శబ్దం ఉత్పత్తి అవుతుంది. టైర్ల నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జై హో’ పాట వాహనంలో స్పష్టంగా వినిపిస్తుంది. గ్లాసెస్ మూసినా కూడా కారు లోపల సాంగ్ వినపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. టన్నెల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్‌సన్స్ గార్డెన్ మధ్యలో 500 మీటర్లు మ్యూజికల్ రోడ్ ఏర్పాటు చేశారు.
రోడ్డు ఎంట్రన్స్ వద్ద సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇన్నోవేషన్ రోడ్ సేఫ్టీని ప్రోత్సహిస్తుందని(స్థిరమైన వేగం అవసరం), ప్రయాణికులకు ఆనందదాయక అనుభవం ఇస్తుందని, భవిష్యత్తులో మరిన్ని స్ట్రెచ్‌లలో విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, యూఏఈల్లో ఇప్పటికే ఇలాంటి మ్యూజికల్ రోడ్లు ఉన్నాయి.
