- కొత్తిండ్ల పండుగల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
- లబ్ధిదారులకు కొత్తబట్టలు పంపిణీ
మహబూబాబాద్ (గార్ల)/ టేకులపల్లి/ భద్రాచలం/ రేగొండ/ మొగుళ్లపల్లి/ జూలూరుపాడు, వెలుగు: పేదల కల సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గృహ ప్రవేశాల సందడి నెలకొన్నది. ఆయాచోట్ల జరుపుకొన్న కొత్త ఇండ్ల పండుగల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. లబ్ధిదారులకు కొత్తబట్టలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీలో లబ్ధిదారు మండ భవాని వినీత్‌గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంతోపాటు గోల్యతండా, బేతంపూడి, తొమ్మిదవ మైల్ తండా, రోళ్లపాడు గ్రామాల్లో చేపట్టిన నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు.
దుమ్ముగూడెం మండలం నర్సాపురం, లచ్చిగూడెం, లక్ష్మీనగరం, నారాయణపేట గ్రామాల్లో 12 మంది లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం, బోజ్యాతండా గ్రామాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ఇందిరమ్మ కొత్త ఇండ్లను ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బైరాగని రమ్య, మద్ది కవిత, మొగుళ్లపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులు ఖ్యాతిరాజు స్వాతి దశరథం నూతన గృహాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి, లబ్ధిదారులకు బట్టలు అందజేశారు.
