ఇండోనేసియాకు కొత్త రాజధాని

ఇండోనేసియాకు కొత్త రాజధాని
  •     కాలిమంతన్’ను అధికారికంగా ప్రకటించిన ప్రెసిడెంట్ జొకో
  •     జకార్తా ముంపు ప్రమాదంతో  తప్పని తరలింపు

జకార్తా: ఇండోనేసియా కొత్త రాజధానిని ‘ఈస్ట్​ కాలిమంతన్’ రాష్ట్రంలో నిర్మించనున్నట్లు ప్రెసిడెంట్​ జొకో విడొడో తెలిపారు. కేపిటల్​ను జకార్తా నుంచి కాలిమంతన్​కు మార్చబోతున్నట్లు గత వారం అధికారికంగా ప్రకటించిన ఆయన.. దాని లొకేషన్​, ప్రాజెక్టు అంచనాల్ని సోమవారం పార్లమెంట్​లో వెల్లడించారు. ఇండోనేసియాలో అతి పెద్ద దీవిగా ఉన్న కాలిమంతన్​లో  ఐదు రాష్ట్రాలుండగా, ఈస్ట్​ కాలిమంతన్​ పేరును ఖరారు చేశారు. ఇక్కడి సమరిండా, బాలిక్​పాపన్​ సిటీల మధ్య సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో కొత్త రాజధాని కడతామన్న ప్రెసిడెంట్​ జొకో.. ప్రకృతి విపత్తుల ముప్పు తక్కువగా ఉన్నందునే ఈస్ట్​ కాలిమంతన్ స్టేట్​ను ఎంపిక చేశామన్నారు. కొత్త కేపిటల్ నిర్మాణానికి (ఇండోనేసియా రుపియా)466 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. ‘‘పెద్ద రాజ్యాల్లో ఒకటిగా,74 ఏండ్లుగా స్వతంత్ర దేశంగా  ఉన్న ఇండోనేసియా ఇప్పటిదాకా తన రాజధానిని సొంతగా ఎన్నుకోలేదు. పైగా గవర్నెన్స్​తోపాటు బిజినెస్​, సర్వీసులకు కేంద్రంగా ఉన్న జకార్తాపై రోజురోజుకూ భారం పెరిగిపోతున్నది’’అని ప్రెసిడెంట్​ వివరించారు. కొత్త రాజధాని కోసం అడవుల్ని నరికేయాల్సి వస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో పెద్ద దీవి జావాలో ఉన్న జకార్తా సిటీ  పదేండ్లలో 3 మీటర్లు నీళ్లలో మునిగిపోయింది. వాతావరణ మార్పులు, గ్రౌండ్​ వాటర్​ను విపరీతంగా తోడేయడం ఇలాగే కొనసాగితే మరో 30 ఏండ్లలో జకార్తాలో మూడో వంతు మునిగిపోవడం ఖాయమని సైంటిస్టులు చెప్పారు. జకార్తాలోని కోటి మందికి తోడు సబర్బన్​లో మరో 40 లక్షల మంది నివసిస్తున్నారు. దీంతో నీళ్ల కొరత, మంత్రులు, గవర్నర్లు కూడా ఫ్రీగా ఆఫీసులకు వెళ్లలేనంతగా  ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. డెవలప్​మెంట్​ మొత్తం జకార్తా చుట్టుపక్కలే జరగడంతో దేశంలోని మిగతా ప్రాంత వాసుల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. కొత్త రాజధాని ఏర్పాటుతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పాలకులు భావిస్తున్నారు.