కేసీఆర్, మోదీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్​

కేసీఆర్, మోదీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు: కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. బుధవారం ఆయన తన పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఎల్లమ్మ ఆలయం, పొట్లపల్లిలోని రాజన్న ఆలయంలో పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్​లో యూత్ కాంగ్రెస్, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో  కేక్ కట్ చేశారు. తర్వాత రెడ్డిబాంధవులు ఏర్పాటుచేసిన కృతజ్ఞతాసభలో మాట్లాడారు. కేసీఆర్ ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు.

ఎంత సేపు కేసీఆర్​కుటుంబం, ఆయన బిడ్డలు, ఫామ్ హౌజ్ లు తప్ప ప్రజల కోసం ఆలోచన చేయలదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారన్నారు. మరి పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్​కు అధికార యావ ఇంకా తగ్గలేదన్నారు. “బీజేపీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. రూ.15 లక్షలు ప్రజల ఖాతాల్లో వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేదు. రైతులకు పెన్షన్ రాలేదు. బీఆర్ఎస్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు.

దళితులకు ఇస్తామన్న దళిత బంధు ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వలేదు. వీటన్నిటి గురించి అందరూ ఆలోచించాలె. సమానత్వాన్ని కాపాడే కాంగ్రెస్ కు అండగా ఉండాలె అని" మంత్రి అన్నారు. కార్యక్రమంలో  పీసీసీ సభ్యుడు లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి రవీందర్, నాయకులు శ్రీరామ్​, హసన్, శ్రీనివాస్​, జేఏసీ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మంజులారెడ్డి, జయపాల్​రెడ్డి పాల్గొన్నారు.