ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమల్లో   పెరుగుతున్న ప్రమాదాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమల్లో   పెరుగుతున్న ప్రమాదాలు
  • వరుసగా రియాక్టర్లు పేలి గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు
  • ఏడాదిలోనే ఆరుగురు మృతి
  • ఫార్మా కంపెనీల్లో తనిఖీలు బంద్ చేసిన ఆఫీసర్లు!
  • ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలన్న రూల్స్ బేఖాతరు 
  • ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య పెరిగే చాన్స్

నల్గొండ, వెలుగు:   ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు ప్రస్తుతం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న పేలుళ్లు కార్మికులను భయపెట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో, ఏ బాయిలర్ విస్ఫోటనం చెందుతుందో తెలియని స్థితిలో వేలాది మంది ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేయాల్సి వస్తోంది. గడిచిన ఏడాది కాలంలోనే వివిధ పారిశ్రామిక ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు బలైపోవడం ఇక్కడి భద్రతా వైఫల్యాలకు అద్దం పడుతోంది. యాజమాన్యాల లాభాపేక్ష ముందు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

3వేలకు పైగా పరిశ్రమలు.. 

హైదరాబాద్‌‌కు కూతవేటు దూరంలో ఉండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వేల పరిశ్రమలకు నిలయంగా మారింది. నల్గొండ జిల్లాలో 700కు పైగా రైస్ మిల్లులు, సిమెంట్ కంపెనీలు ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, బీబీనగర్ లాంటి ప్రాంతాల్లో ఫార్మా, బల్క్ డ్రగ్ యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో 3,000కు పైగా ఉన్న ఈ పరిశ్రమల్లో మెజారిటీ రసాయన  పరిశ్రమలే. వీటిలో నిరంతరం మండే స్వభావం ఉన్న కెమికల్స్, భారీ ఒత్తిడితో పనిచేసే బాయిలర్లు ఉండటంతో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదానికి దారితీస్తోంది.

కానరని తనిఖీలు..!

వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇన్‌‌స్పెక్టర్​ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక, అగ్నిమాపక శాఖలు కలిసి తనిఖీలు నిర్వహించాలి. కానీ, పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తనిఖీలు చేయకుండానే ఏసీ గదుల్లో కూర్చుని ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇచ్చే భారీ ముడుపులకు లొంగి అధికారులు లోపాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కేవలం ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత యాజమాన్యాలతో చేతులు కలిపి కేసులను నీరుగార్చడం పరిపాటిగా మారింది.

సిబ్బంది కొరత సాకుతో..

జిల్లాల విభజన జరిగినా పరిశ్రమల పర్యవేక్షణ కార్యాలయాలు మాత్రం ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో ఉన్న పరిశ్రమలను తనిఖీ చేయడానికి కనీసం పది మంది సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. తనిఖీల గురించి ప్రశ్నిస్తే అధికారులు సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సాయి కెమికల్‌‌లో జరిగిన పేలుడు, గతేడాది ఏప్రిల్‌‌లో ప్రీమియర్ ఎక్స్‌‌ప్లోజివ్స్‌‌లో ముగ్గురిని బలితీసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పరిశ్రమలు మరిన్ని ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉంది.