ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి

ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. ఓ వైపు వర్షం.. మరోవైపు వరదతో మహానగరం కాస్త మహాసముద్రంలా మారింది. అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. రోడ్లు.. ఇళ్లు.. రైల్వే ట్రాక్ లు.. ఎటు చూసినా నడుంలోతు నీరు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముంబై జనం గుండెల్లో రాయి పడినట్టైంది. ఇప్పటికే ప్రాణాలరచేత పెట్టుకుని కాలం వెల్లదీస్తోంటే.. మళ్లీ భారీ వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ముంబైలో కేవలం నిన్న ఒక్క రాత్రే.. 54 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. పదేళ్లలో ఇదే అత్యధిక వర్షాపాతమని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు.. వరదల కారణంగా.. ఇవాళ మహారాష్ట్రలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే పనిచేస్తాయని చెప్పింది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సలహా ఇచ్చింది.