పులిని చంపిన వేటగాళ్ల కోసం ముమ్మర దర్యాప్తు

పులిని చంపిన వేటగాళ్ల కోసం ముమ్మర దర్యాప్తు

ఆసిఫాబాద్, వెలుగు: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పులి మృతి చెందిన ఘటనలో ఫారెస్ట్ ఆఫీసర్లు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రే వాల్ వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్టీసీఏ  ప్రొటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారం ముగ్గురు వెటర్నరీ డాక్టర్ల బృందంతో పోస్ట్ మార్టం పూర్తి చేసిన అనంతరం ఖననం చేశారు. శుక్రవారం రాత్రి నుంచే పాత వేటగాళ్లు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం చేపట్టారు. 

శనివారం విచారణ చేపట్టారు. సుమారు12 మంది అనుమానితులను బెల్లంపల్లి ఫారెస్ట్ ఆఫీస్ లో ఉంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన నిందితులెవరూ..? ఎవరు ప్లాన్ చేశారు.? ఎవరు అమలు చేశారు..? ఎలా చేశారు..? అనే ప్రశ్నలు వేస్తూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో మొదట నేరం తాము చేయలేదని బుకాయించిన వాళ్లు ఆదివారం మధ్యాహ్నం చివరకు పులిని హతమార్చినది తామేనని ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  నిందితులు ఎలాంటి సెల్ ఫోన్లు వాడకుండా నేరానికి పాల్పడినట్లు సమాచారం. పులి చర్మం, గోళ్లు, దంతాలు రికవరీ చేసే పనిలో అధికారుల బృందం నిమగ్నమైంది. 

విజిలెన్స్ డీఎఫ్ ఓ రాజారమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణను బృందం అధికారులు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితులకు గతంలో వన్యప్రాణులనువేటాడిన చరిత్ర ఉన్నట్టు, దీనిపై ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని , నిందితులు పులిని హతమార్చేందుకు వాడిన వస్తువులతో త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నేషనల్ టైగర్ అథారిటీ సభ్యుడు సహా మరికొందరు అధికారులు పులి మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారని డీఎఫ్ఓ తెలిపారు.