షాద్‌నగర్, వెలుగు: కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి షాద్‌నగర్ డీసీపీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌దేవ్ సింగ్, షమ్‌షేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ కూలీలుగా పనిచేస్తూ తెలంగాణలోని రోడ్లపై అవగాహన పెంచుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.
ఈ నెల 25న కేశంపేట మండలం సంతాపూర్ శివారులో వృద్ధురాలిని మోసగించి, 4 తులాల పుస్తెలతాడు, అదే రోజు కడ్తాల్‌లో మరో మహిళ వద్ద 3 తులాల పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. బుధవారం కేశంపేట ఎక్స్ రోడ్డు వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కొత్తకోట ప్రాంతంలో బైక్‌ను చోరీ చేసి, అదే వాహనంతో దొంగతనాలకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని తెలిపారు. 7 తులాల గోల్డ్‌చైన్లు, 3 సెల్‌ఫోన్లు, ఒక బైక్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నరహరి పాల్గొన్నారు.
