తల్లి తిట్టిందని చెరువులో దూకిన ఇంటర్ విద్యార్థిని

తల్లి తిట్టిందని చెరువులో దూకిన ఇంటర్ విద్యార్థిని
  • ఫోన్ వాడొద్దని తల్లి తిట్టిందని ఆత్మహత్యాయత్నం
  • దుర్గం చెరువులో దూకిన ఇంటర్ విద్యార్థిని కాపాడిన లేక్ పోలీసులు

మాదాపూర్, వెలుగు: ఎక్కువ సేపు సెల్​ఫోన్ వాడొద్దని తల్లి తిట్టిందని ఓ ఇంటర్ విద్యార్థిని దుర్గం చెరువులో దూకగా.. లేక్ పోలీసులు ఆమెను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది.  ఇన్ స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్​బీలో ఉండే ఓ యువతి(18) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కొంతకాలంగా  సెల్​ఫోన్ ఎక్కువగా వాడటం, ఇన్​స్టాలో చాటింగ్ చేస్తుండటంతో ఆమెను ఇటీవల తల్లి మందలించింది.


మనస్తాపానికి గురైన యువతి మంగళవారం ఉదయం 7.30 గంటలకు కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వచ్చింది. అయితే, ఆమె కాలేజీకి వెళ్లకపోవడంతో మేనేజ్​మెంట్ తల్లికి సమాచారం అందించింది. యువతి తల్లి కేపీహెచ్​బీ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విద్యార్థిని సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు.  దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఉన్నట్లు గుర్తించి మాదాపూర్ పోలీసులకు చెప్పగా.. ఇన్ స్పెక్టర్ తిరుపతి వెంటనే లేక్ పోలీసులను అలర్ట్ చేశారు.


సదరు విద్యార్థిని మధ్యాహ్నం 3.15 గంటలకు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. వెంటనే లేక్​ పోలీసులు, బోట్ సిబ్బంది ఆమెను కాపాడి హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.