అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్, 5 బైకులు, డమ్మీ గన్ స్వాధీనం

అంతర్రాష్ట్ర  డ్రగ్స్  ముఠా గుట్టురట్టు.. 8 మంది  అరెస్ట్, 5 బైకులు, డమ్మీ గన్ స్వాధీనం
  • ఒడిశా నుంచి గంజాయి, వీడ్  ఆయిల్ స్మగ్లింగ్

నల్గొండ, వెలుగు: ఒడిశా నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఎర వేస్తున్న 8 మందిని నల్గొండ పోలీసులు అరెస్ట్  చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి, వీడ్  ఆయిల్, దొంగిలించిన బైకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివరామ్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితులైన కస్పరాజు నాగరాజు, గంటెకంపు మధు మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పెండ్ర వాసు, హరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. జూన్  29న నిందితులు బైక్‌లపై ఒడిశాలోని పసుపులంక గ్రామం వెళ్తూ ఖమ్మం జిల్లా ఏక్నూర్  వద్ద యాక్టివా మోపెడ్​ను దొంగిలించారు. అనంతరం ఒడిశాలోని ప్రధాన సప్లయర్​ మనుకర్  వద్దకు వెళ్లి అప్పటికే హైదరాబాద్ లో దొంగిలించిన రెండు బైక్‌లను ఇచ్చి రూ.90 వేల విలువైన 12 కిలోల గంజాయి, రూ.లక్ష విలువైన 500 ఎంఎల్  హాష్  ఆయిల్  కొనుగోలు చేశారు. ఈ నెల 24న నల్గొండలో వాటిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కాలేజీ స్టూడెంట్లు, యువతకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5.6 కిలోల గంజాయి,  100 ఎంఎల్  హాష్  ఆయిల్, దొంగలించిన 5 బైకులు, 4 సెల్ ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక బటన్  చాకు స్వాధీనం చేసుకున్నారు. కస్పరాజు నాగరాజు, గంటెకంపు మధు, చెన్నపాక సుశాంక్, సయ్యద్  షోయబ్, గంధం శివమణి, చెరుకు దీపక్, నకిరేకంటి ధరణి కుమార్ తో పాటు ఓ మైనర్ ను అదుపులోకి తీసుకోగా, మనుకర్, హరి, ఉదయ్, జున్ను పరారీలో ఉన్నారు.