న్యూఢిల్లీ: భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో(ఈటీఎఫ్) పెట్టుబడులు భారీగా పెరిగాయి. 2026 మార్చి క్వార్టర్‌లో రూ.31,561 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. ఈ మార్చిలోనే రూ.2,266 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించింది.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో పెట్టుబడుల వేగం కొంత తగ్గింది. ఈ ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 69 లక్షల నుంచి 1.24 కోట్లకు పెరిగింది. పెట్టుబడిదారులకు బంగారంపై ఆసక్తి పెరుగుతోందని దీని ద్వారా స్పష్టమవుతోందని యాంఫీ తెలిపింది. ఫిజికల్ గోల్డ్ నిల్వ ఉంచడం కంటే ఈటీఎఫ్ రూపంలో పెట్టుబడి పెట్టడం సౌకర్యంగా ఉండటమే దీనికి కారణం. మొత్తం గోల్డ్ ఫండ్ల ఆస్తుల విలువ రూ.1.71 లక్షల కోట్లకు చేరింది.

