- చాలాచోట్ల సమయానికి స్కూళ్లకు రాని టీచర్లు..
- స్కూల్స్ లో కనిపించని డెవలప్ మెంట్..
- మాఊరు... మాబడి నిధులు మంజూరైనా ప్రారంభంకాని పనులు..
- మూత్రశాలలు, మరుగు దొడ్లు లేక ఇబ్బందులు
- కొన్ని తరగతి గదులు ప్రమాదకరంగా పెచ్చులూడాయ్
వేసవి సెలవుల తర్వాత బడిగంట మోగింది. ఇవాళ్టి నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కావడంతో విద్యార్థులు పుస్తకాల బ్యాగ్ లతో బడిబాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు పిల్లలతో సందడిగా మారాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చెప్పినా, అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయలేదన్నారు పేరెంట్స్. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. కొమ్రం భీం జిల్లాలో మొదటి రోజు కావడంతో పేరెంట్స్ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోను ఇదే పరిస్థితి. స్టూడెంట్స్ చాలా తక్కువ మందే బడులకు వచ్చారు. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంది. టీచర్లు చాలా మంది సమయానికి స్కూళ్లకు రాలేదు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసుకున్న స్కూల్స్ లో డెవలప్ మెంట్ కనిపించలేదు. ఉట్నూర్ మండలం లక్కారం హైస్కూల్ లో వర్షం పడితే క్లాసు రూం పెచ్చులు పడి ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మాఊరు... మాబడి క్రింద నిధులు మంజూరైనా, పనులు ప్రారంభం కాలేదని చెప్పారు.
విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే పాఠశాలల్లో మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అమలు కాలేదు. మన ఊరు మన బడి కింద పథకం పాఠశాలల్లో పనులు మొదలు కాలేదు. నిజామాబాద్ లోని గర్ల్స్ హైస్కూల్ లో రేకులు పగిలి వర్షం నీరంతా తరగతి గదుల్లోకి వచ్చి చేరింది. పగిలిన కిటికీలలు, తలుపులు, అపరిశుభ్రమైన టాయిలెట్స్, క్లాస్ రూంలు విద్యార్థులకు స్వాగతం పలికాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా స్కూళ్లలో క్లాసు రూంలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఈ ఏడాది కూడా చెట్ల కిందే చదువు కోవాల్సిన పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లాలో క్లాస్ రూమ్స్ శుభ్రం చేయలేదు. దీంతో విద్యార్థులను బయటే కూర్చోబెట్టారు. స్కూళ్ల రీ ఓపెన్ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో అలంకరించారు. దీంతో స్కూళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామన్నారు టీచర్లు. చాలా స్కూల్స్ లో విద్యార్థులకు తగినంత టీచర్ల సంఖ్య లేరని పేరెంట్స్ అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం , తెలుగు మీడియం విద్యార్థులను కలిపి కూర్చోబెట్టారు. బడిగంట మోగడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులంతా పుస్తకాలతో స్కూళ్ల బాట పట్టారు. మన ఊరు మనబడి కింద ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇంకా ఎక్కడా పనులు పూర్తి కాలేదు. దీంతో ఉన్న వసతులతోనే విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు టీచర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించారు. అనుమతి, ఫిట్ నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. ముస్తాబాద్ మండలంలో ఫిట్ నెస్ లేని రెండు ప్రైవేటు పాఠశాల బస్సులను సీజ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మరో రెండు ప్రైవేటు పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్దె భవనాలు..అరకొర వసతుల మధ్య ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. వరంగల్ లో అద్దె భవనాల్లో మూత్రశాలలు, మరుగు దొడ్లు లేక పోవటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు విద్యార్ధులు. చాలా స్కూళ్లలో కరోనా నిబంధనలు పాటించలేదు. పాఠశాలలో శానిటేషన్ నిర్వహించలేదు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మాస్కులు ధరించలేదు. జనగామ జిల్లా కేంద్రంలోని బాలికల సెకండరీ స్కూల్ లో కొన్ని తరగతి గదులు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్నా అధికారులు స్పందించ లేదు. మౌలిక వసతులు లేకుండానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను ఈ విద్యా సంవత్సరానికి విడుదల చేసిందని.. ఉన్న వసతులతో పాటు నిధులు మంజూరు చేస్తే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు తీసుకొస్తామన్నారు ఉపాధ్యాయులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మన ఊరు.. మన బడి' కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల నూతన భవనాలు, మరమ్మతు పనులు చాలా చోట్ల పెండింగ్ లో ఉన్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు అంబేద్కర్ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 9 దాటినా తెరుచుకోలేదు. తాళం వేసి ఉండడంతో వచ్చిన ఒక్క విద్యార్థి స్కూల్ ఆవరణలో చాలా సేపు వేచి ఉన్నాడు. పాఠశాల సిబ్బందితో పాటు టీచర్లు రాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. వనపర్తిలో గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో పూలతో విద్యార్థులకు స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. వేసవి సెలవుల్లో బడి బాట కార్యక్రమంలో అడ్మిషన్ల కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మొదటి రోజు కావడంతో స్కూళ్లకు తక్కువగా వచ్చారు విద్యార్థులు. ఈ నెల చివరి వరకు యూనిఫాంలు, బుక్స్ రావొచ్చన్నారు టీచర్లు.
