కొత్త ఫోన్ కొన్నానన్న ఆనందం ఆ వ్యక్తికి 20 రోజులు కూడా నిలవలేదు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా దాదాపు రూ.లక్షా 50వేలు విలువైన ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనుగోలు చేసిన ఢిల్లీకి చెందిన ఒక బాధితుడు.. ఇప్పుడు ఫోన్ లేకపోయినా ప్రతి నెల రూ.12 వేలు EMI కడుతూ లబోదిబోమంటున్నాడు. అసలు ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉన్న అతనికి, తీరా ఫోన్ పోయాక తెలిసింది తాను మోసపోయానని.
అసలేం జరిగింది?
జనవరి 16, 2026న యువకుడు బజాజ్ స్టోర్‌లో ఫోన్ కొన్నాడు. చేతిలో మెుత్తం డబ్బు లేక రూ.40వేలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన దానికి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫోన్ ఇన్సూరెన్స్ కోసం రూ.13వేలు డబ్బు చెల్లించాడు. అయితే తన మామగారి అంత్యక్రియల ఊరేగింపులో ఉండగా ఫోన్ చోరీకి గురైంది. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధైర్యంగా ఆపిల్ కేర్, బజాజ్ కేర్‌లకు ఫోన్ చేయగా.. అసలు తన ఫోన్ పేరు మీద ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ రిజిస్టర్ కాలేదని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
"Bajaj Insurance Scam."
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) April 20, 2026
A youth purchased a phone with insurance.
He paid the premium and continued paying EMIs. When he lost his phone, the insurance company refused to cover theft and loss.
Almost every insurance company harasses its customers when it comes to coverage. pic.twitter.com/zu4NGfZis7
స్టోర్ వాళ్ల నిర్లక్ష్యం - ఎదురుదాడి..
తన దగ్గర రూ.13 వేలు ఇన్సూరెన్స్ కోసం వసూలు చేసిన స్టోర్ ప్రతినిధులను నిలదీయగా.. వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పాలసీ రాకపోతే మమ్మల్ని అడగాల్సింది.. ఇప్పుడు మాకు సంబంధం లేదంటూ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలపైకి నెట్టే ప్రయత్నం చేశారు షోరూమ్ సిబ్బంది. రెండు గంటల వాదన తర్వాత మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి తాము ఏమీ చేయలేమని చేతులెత్తేయటం బాధితుడిని మరింత కుంగదీసింది. కస్టమర్ యాప్, మెయిల్, ఎస్ఎంఎస్.. ఎక్కడ వెతికినా పాలసీ ఆనవాళ్లు లేకపోవడం గమనార్హం.
ALSO READ : ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 2 సార్లు జీతం..
ఆరు నెలల పాటు తన జీతం డబ్బులు దాచుకుని.. కంటెంట్ క్వాలిటీ పెంచడం కోసం ఈ ఫోన్ కొన్నానని ఆ యువకుడు వాపోయాడు. ఇప్పుడు చేతిలో ఫోన్ లేదు.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. కానీ ప్రతి నెల తప్పనిసరిగా రూ.12వేలు ఈఎంఐ మాత్రం బజాజ్ ఫైనాన్స్‌కు కట్టాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అనేక మెయిల్స్ పంపినా కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదని, ఇది స్పష్టమైన 'మిస్ సెల్లింగ్' మోసం అని యువకుడు ఆరోపించాడు.
తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదంటూ బాధితుడు సోషల్ మీడియాలో అందరినీ హెచ్చరిస్తూ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఎవరైనా బజాజ్ లేదా ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా ఫోన్ కొన్నప్పుడు.. ఇన్సూరెన్స్ కోసం డబ్బు చెల్లించిన వెంటనే పాలసీ పేపర్స్, అప్‌డేట్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలని కోరాడు. లేదంటే అవసరానికి ఆదుకోని ఆ ఇన్సూరెన్స్ కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది. సామాన్యుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి మోసాలపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. చివరికి ఫోన్ పాయె.. ఇన్సూరెన్స్ లేకపాయె, కట్టాల్సిన ఈఎంఐలు మిగిలే ఆ యువకుడికి.

