పిల్లలు మొదటి మాటలు ఎప్పుడు పలుకుతారా అని తల్లిదండ్రులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. ఒకవేళ మాటలు రావడంలో ఆలస్యమైతే ఆందోళన చెందడం సహజం. ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు మాటలు రాకపోతే అది 'ఆటిజం' ఏమోనని భయపడుతున్నారు. కానీ, వైద్య నిపుణులఅభిప్రాయం ప్రకారం.. మాటలు రాకపోవడానికి, ఆటిజానికి మధ్య చాలా తేడా ఉంది.
1. కేవలం మాటలు ఆలస్యమైతే (Speech Delay):
కొంతమంది పిల్లలు మాట్లాడటం ఆలస్యంగా మొదలుపెడతారు, కానీ వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. పిల్లలకి ఏం కావాలన్నా వేలు చూపించి అడగడం, తల ఊపడం, చేతులతో సైగలు చేయడం వంటివి చేస్తారు. ఇంకా పేరు పెట్టి పిలిచినప్పుడు వెంటనే స్పందిస్తూ పలుకుతారు. మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్ళలోకి చూస్తూ సమాధానం ఇస్తారు. పిల్లలు మాట్లాడలేకపోయినా, మీరు చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకుంటారు.
2. ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయంటే
ఆటిజం ఉన్న పిల్లల్లో మాటలు ఆలస్యమవడంతో పాటు ఇతర సామాజిక ఇబ్బందులు కూడా ఉండవచ్చు. పిల్లలు ఎదుటివారితో కళ్ళలోకి చూసి మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. పేరు పెట్టి పిలిచినా పెద్దగా స్పందించకపోవడం, పలకకపోవడం..
ఇంకా ఇతర పిల్లలతో కలవడానికి ఇష్టపడరు, ఎక్కువగా ఒంటరిగా ఉండటం చేస్తుంటారు. కొన్ని పనులను పదే పదే చేయడం లేదా కొన్ని పదాలను మళ్ళీ మళ్ళీ పలకడం చేస్తుంటారు. చివరికి వారికి ఏం కావాలనేది సైగల ద్వారా చెప్పడంలో కూడా ఇబ్బంది పడతారు.
ALSO READ : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా ?
ముందుగా గుర్తింపు
పిల్లల ఎదుగుదలలో మాటలు అనేవి ఒక భాగం మాత్రమే. మాటలతో పాటు వారు ఇతరులతో ఎలా మమేకమవుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అనేది గమనించడం చాలా ముఖ్యం. సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత త్వరగా వారికి అవసరమైన 'స్పీచ్ థెరపీ' లేదా ఇతర వైద్య సహాయం అందించవచ్చు. మాటలు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన అది ఆటిజం అని భయపడాల్సిన పనిలేదు.
ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఏవైనా గమనిస్తే, ఆందోళన చెందకుండా వెంటనే చిన్న పిల్లల నిపుణుడిని లేదా డెవలప్‌మెంటల్ ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించండి. సరైన సమయంలో అందించే చికిత్స పిల్లల భవిష్యత్తును మెరుగుపరుస్తుంది.

