ఎండలు మండిపోతున్నాయి...భానుడి ఉగ్రరూపం అంటే ఏంటో తెలిసొచ్చే రేంజ్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఒక బాధ... రోడ్డెక్కితే మాడు పగిలిపోయే ఎండతో మరో బాధ వెరసి నరకం చూస్తున్నామని అంటున్నారు జనం. మన పరిస్థితే ఇలా ఉంటే... ఇక నిత్యం రోడ్డు మీదనే ఉంటూ ట్రాఫిక్ కంట్రోల్ చేసే ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎనిమిది గంటల పాటు ఎండలో, పొల్యూషన్ లో నిలబడి డ్యూటీ చేయడం మాములు విషయం కాదు... ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటం అనొచ్చేమో. అందుకే హైదరాబాద్ పోలీసులు ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. ఎండ నుంచి ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు మిస్ట్ ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ దగ్గర ఏర్పాటు చేసిన మిస్ట్ ఫ్యాన్ డెమోను పరిశీలించారు జాయింట్ సిపి జోయల్ డేవిస్ , డిసిపి అవినాష్ కుమార్. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ... ట్రాఫిక్ సిబ్బంది 8 గంటల పాటు రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారని , వేసవిలో వడగాల్పులు కారణంగా ట్రాఫిక్ సిబ్బంది అనారోగ్యం బారిన పడుతున్నారన్నారని అన్నారు.
►ALSO READ | హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి జారిపడి బాలుడు మృతి..
ట్రాఫిక్ సిబ్బందికి వెసులుబాటు కోసం ఈ మిస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేశామని... మోటార్ సహాయంతో నీటిని పంప్ చేస్తూ టెంపరేచర్ ను తగ్గిస్తుందన్నారు. డెమోగా ఏర్పాటు చేసి పరిశీలించామని , సిబ్బంది ఫీడ్ బ్యాక్ తీసుకొని సిటీ మొత్తం వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు జాయింట్ సీపీ జోయెల్ డేవిస్.

