ముంబై: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న రాజస్తాన్ రాయల్స్.. ఐపీఎల్–19లో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ (32, 3/17) సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టడంతో.. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ 30 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 205/8 స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ (36 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), డాసున్ షనక (29) ఫర్వాలేదనిపించారు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 175/9 స్కోరుకే పరిమితమైంది.
సూర్యకుమార్ యాదవ్ (42 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), విల్ జాక్స్ (33) పోరాటం చేసినా ప్రయోజనం దక్కలేదు. ఆర్చర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్.. హైదరాబాద్‌తో తలపడుతుంది.
చివర్లో మెరుపులు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (4) విఫలం కాగా, యశస్వి జైస్వాల్ (27) మెరుపులు ఎక్కువసేపు సాగలేదు. 33 రన్స్‌కే ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. వన్‌డౌన్‌లో జురెల్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో సరైన సహకారం లభించలేదు.
ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ రియాన్ పరాగ్ (14) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. మూడో వికెట్‌కు 21 రన్స్ జోడించి వెనుదిరిగాడు. ఫలితంగా రాజస్తాన్ 54/3తో పవర్‌ప్లేను ముగించింది. జురెల్‌తో కలిసిన షనక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కొంత వరకు సమర్థంగా నిర్వహించాడు.
సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. దాంతో తొలి పది ఓవర్లలో రాయల్స్ 94/3తో నిలిచింది. కానీ 11వ ఓవర్‌లో షనక అనూహ్యంగా రనౌట్ కావడంతో నాలుగో వికెట్‌కు 45 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. కొద్దిసేపటికే జురెల్ కూడా వెనుదిరగడంతో స్కోరు 119/5గా మారింది.
దీంతో రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో ఆర్చర్ మెరుపులు మెరిపించాడు. డొనోవాన్ ఫెరీరా (18)తో ఆరో వికెట్‌కు 20, శుభమ్ దూబే (5)తో ఏడో వికెట్‌కు 35 రన్స్ జోడించాడు. జడేజా (19 నాటౌట్) బ్యాట్ ఝుళిపించాడు. చివరి ఐదు ఓవర్లలో 73 రన్స్ రావడంతో స్కోరు రెండొందలు దాటింది. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఆర్చర్ బౌలింగ్ షో
బ్యాటింగ్‌లో మెరిసిన ఆర్చర్ పదునైన బౌలింగ్‌తో ముంబై టాప్ ఆర్డర్‌ను శాసించాడు. దాంతో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే రోహిత్ శర్మ (0)ను డకౌట్ చేసిన ఆర్చర్.. మూడో ఓవర్‌లో నమన్ ధీర్ (6)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో ఓవర్లో బర్గర్ (2/43) దెబ్బకు ర్యాన్ రికెల్టన్ (12) ఔటయ్యాడు. ఆరో ఓవర్‌లో బ్రిజేష్ శర్మ (2/26).. తిలక్ వర్మ (0)ను డకౌట్ చేశాడు. ఫలితంగా 38/4తో కష్టాల్లో పడిన ముంబై 49/4తో పవర్‌ప్లేను ముగించింది. ఇక్కడి నుంచి సూర్య ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. విల్ జాక్స్ (33) కూడా అండగా నిలవడంతో ఐదో వికెట్‌కు 63 రన్స్ జతయ్యాయి.
ఇక రెండుసార్లు రనౌట్, ఒక క్యాచ్ డ్రాప్ నుంచి బయటపడిన సూర్య 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. జాక్స్ ఔట్ తర్వాత వచ్చిన హార్దిక్ వేగంగా ఆడినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై విజయానికి 59 రన్స్ అవసరమైన దశలో పాండ్యాను ఆర్చర్ ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 48 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 12 బాల్స్ తేడాలో కార్బిన్ బోష్ (2), సూర్య, దీపక్ చహర్ (8) వికెట్లు ఇవ్వడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి.
సంక్షిప్త స్కోర్లు
- రాజస్తాన్: 20 ఓవర్లలో 205/8 (జురెల్ 38, ఆర్చర్ 32, దీపక్ చహర్ 2/43).
- ముంబై: 20 ఓవర్లలో 175/9 (సూర్య 60, హార్దిక్ 34, ఆర్చర్ 3/17).
