టాప్ ఐదు ఐపీఓలు ఇవే

టాప్ ఐదు ఐపీఓలు ఇవే

 

  •     ఇన్వెస్టర్ల ముందుకు 5 ముఖ్యమైన ఇష్యూలు
  •     మొత్తం 23 వరకు  ఐపీఓలు వచ్చే చాన్స్​

ముంబై: స్టాక్​ మార్కెట్లో కిందటి ఏడాది లిస్టయిన ఐపీఓల్లో చాలా వరకు సక్సెస్​ అయ్యాయి. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. జొమాటో, పేటీఎం, నైకా వంటి పెద్ద స్టార్టప్​లు కూడా ఐపీఓలకు వచ్చాయి. కొత్త సంవత్సరంలోనూ మరికొన్ని కంపెనీలు నిధుల కోసం మార్కెట్​వైపు చూస్తున్నాయి. ఎల్ఐసీ, ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్స్, అదానీ విల్మార్​, ఓయో వంటి బడా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) కు రెడీ అవుతున్నాయి.  2022లో దాదాపు రూ. 44వేల కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో దాదాపు23 కంపెనీలు తమ ఐపీఓలను తేవడానికి సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో ఐదు ముఖ్యమైన ఐపీఓల గురించి తెలుసుకుందాం. 

ఎల్ఐసీ ఐపీఓ: 
ఈ సంవత్సరం ఇది అత్యంత పాపులర్​పబ్లిక్ ఆఫర్​గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి–-మార్చి క్వార్టర్​లో ఎక్సేంజీల్లో లిస్టవుతుందని అంటున్నారు.   ఎల్ఐసీ ఐపీఓ కోసం ప్రభుత్వం రూ.ఎనిమిది లక్షల కోట్ల (109 బిలియన్ డాలర్లు)– రూ. 10 లక్షల కోట్ల మధ్య వాల్యుయేషన్​ను కోరుతోంది.  ఇష్యూ సైజులో10 శాతం పాలసీదారుల కోసం ప్రభుత్వం రిజర్వ్ చేస్తుంది. పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌ ఆలస్యమవుతుందంటూ వచ్చిన పుకార్లను ప్రభుత్వం  తోసిపుచ్చింది. 

అదానీ విల్‌‌‌‌మార్: అదానీ విల్‌‌‌‌మార్ తన పబ్లిక్ ఇష్యూతో ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ.4,500 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇష్యూ ద్వారా వచ్చే డబ్బును ప్రస్తుత యూనిట్ల విస్తరణకు, కొత్త ప్లాంట్లను పెట్టడానికి, అప్పులు కట్టడానికి, క్యాపిటల్​ను పెంచడానికి వాడుతారు. పెట్టుబడులకు నిధులు సమకూర్చడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కొంత డబ్బును పక్కన పెడతారు. అదానీ విల్‌మార్ భారతదేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటి. ఇన్వెస్టర్లు తమ లిస్టులో ఈ ఐపీఓను తప్పక చేర్చుకోవాలని స్టాక్​ మార్కెట్​ ఎనలిస్టులు అంటున్నారు. మార్కెట్లో లిస్ట్ కాబోతున్న ఏడవ అదానీ కంపెనీ ఇది.
ఓయో: హాస్పిటాలిటీ యూనికార్న్​ స్టార్టప్ ఓయో లిమిటెడ్ ఐపీఓకు రావడానికి ఇది వరకే సెబీకి డాక్యుమెంట్లను సమర్పించింది. దీనిపై నిర్ణయం పెండింగ్‌‌‌‌లో ఉంది. ఓయో  పేరెంట్​ కంపెనీ ఒరావెల్ స్టేట్.  సెబీ ఆమోదం పొందితే, ఓయో   తన షేర్లను అమ్మడం ద్వారా రూ. 8,430 కోట్లను సమీకరిస్తుంది. ఓయోకు మనదేశంతోపాటు విదేశాల్లోనూ అసెట్స్ ఉన్నాయి. 

డెల్హివరీ ఐపీఓ: కొరియర్​, లాజిస్టిక్​ సేవలు అందించే డెల్హివరీ కూడా తన ఇనీషియల్ ఆఫర్ కు రెడీ అవుతోంది. రూ.7,460 కోట్లను సేకరించడం కోసం సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను అందజేసింది.  ఇది ఈ ఏడాదిలోనే మార్కెట్‌‌‌‌లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ తాజా ఇష్యూ ద్వారా రూ. 5వేల కోట్లను సమీకరిస్తుండగా, మిగిలిన షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా అమ్మనుంది.

ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్స్   
స్టేట్ బ్యాంక్  తన మ్యూచువల్ ఫండ్ వింగ్​లో  వాటాను  పబ్లిక్ ఇష్యూ ద్వారా అమ్మనుంది.  ఐపీఓ ద్వారా దాదాపు రూ.7,500 కోట్లు సమీకరించనుంది. కంపెనీలో ఆరుశాతం వాటాను ఐపీఓ ద్వారా అమ్మడానికి బ్యాంక్ సెంట్రల్ బోర్డ్  ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది.  పైన పేర్కొన్న ఐదింటితోపాటు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ (రూ. 4,000 కోట్లు), వేదాంత్​ ఫ్యాషన్స్ (రూ. 2,500 కోట్లు), పరదీప్ ఫాస్ఫేట్స్ (రూ. 2,200 కోర్), మెదాంత (రూ. 2,000 కోట్లు)  ఇక్సిగో (రూ. 1,80 కోట్లు) కూడా పబ్లిక్​ ఇష్యూకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. స్కాన్‌‌‌‌‌‌రే టెక్నాలజీస్, హెల్తియం మెడ్‌‌‌‌టెక్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ కూడా ఇష్యూలకు వచ్చే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు తెలిపారు.