Sean Williams: టీ20 వరల్డ్ కప్ ముందు జింబాబ్వేకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌ రిటైర్మెంట్

Sean Williams: టీ20 వరల్డ్ కప్ ముందు జింబాబ్వేకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌ రిటైర్మెంట్

జింబాబ్వే ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్ టీ20ల నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్‌ గడ్డపై ఆతిథ్య జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన అనంతరం అతను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. 37 ఏళ్ల విలియమ్స్ వన్డేలు, టెస్టుల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరో 19 రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో అతని రిటైర్మెంట్.. జింబాబ్వే జట్టుకు తీరని లోటుగా చెప్పుకోవాలి. 

సీన్ విలియమ్స్ టీ20ల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే అతను తన నిర్ణయాన్ని జట్టు సభ్యులకు తెలియజేశాడు అని ఓ అధికారి క్రిక్‌బజ్‌కు తెలిపినట్లు కథనాన్ని ప్రచురించింది. 

విలియమ్స్ బ్యాటరే కాదు.. మంచి స్పిన్నర్ కూడానూ. 2006లో బంగ్లాదేశ్‌పై టీ20 అరంగేట్రం చేసిన సీన్.. పొట్టి ఫార్మాట్‌లో జాతీయ జట్టును ధీటుగా నిలిపాడు. 81 మ్యాచ్‌ల్లో 23.48 సగటుతో 1691 పరుగులు చేశాడు. 6.93 ఎకానమీ రేటుతో 48 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో విలియమ్స్ అత్యధిక విజయాలు నమోదు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 156 మ్యాచ్‌ల్లో 38.06 సగటుతో 4986 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి . వన్డేల్లో 83 వికెట్లు కూడా సాధించాడు.