రాజకీయ దాడులు పెరుగుతున్నయ్..డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

రాజకీయ దాడులు పెరుగుతున్నయ్..డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

బషీర్​బాగ్​,వెలుగు : రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ దాడులు, పోలీసుల పక్షపాత వైఖరిపై బీజేపీ నాయకత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించింది. నల్గొండ జిల్లా చండూరులో బీజేపీ నాయకులపై జరిగిన హత్యాయత్యాన్ని డీజీపీకి వివరించారు.

ఈ దాడిలో పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడినప్పటికీ.. పోలీసులు నిందితులపై బలహీనమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి వదిలేశారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాతానికి నిదర్శనమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై ఒక డీఎస్పీ అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ప్రస్తావించారు.