- పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారు: హరీశ్ రావు
- స్కామ్‌తో నేరుగా రూ.1800 కోట్లు వస్తయ్
- వాటిని నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: హ్యామ్ రోడ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఆర్ అండ్ బీ కింద రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రోడ్ల కింద రూ.6 వేల కోట్ల స్కామ్ జరుగుతున్నదన్నారు. పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. స్కామ్‌లో భాగంగా రూ.1800 కోట్లు నేరుగా వస్తాయని, నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపుతారన్నారు.
‘‘హ్యామ్ రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారు. దేశం మొత్తం హైవే టెండర్లు సాధారణంగా 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు వెళ్తాయి. కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయి. 50 శాతం తేడా వస్తున్నది. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసింది. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే.. ఇప్పుడు పది శాతం పెట్టారు.
పంచాయతీరాజ్ లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేసుకున్నారు. ఇప్పటిదాకా ఖరారు చేసిన టెండర్లను రద్దు చేయాలి. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్, అన్ని విచారణ సంస్థలకూ ఫిర్యాదు చేస్తం’’ అని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేటపై ఎందుకంత కక్ష?
సిద్దిపేట నియోజకవర్గంలో రద్దు చేసిన 1,070 కోట్ల రూపాయల నిధులను పునరుద్ధరించి నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలని హరీశ్ డిమాండ్ చేశారు. సిద్దిపేటపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంత కక్ష పెంచుకున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సీఎంకు ఆయన లేఖ రాశారు. నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని తెలిపారు.
