- పోటీ పరీక్షలు, ర్యాంగింగ్, వ్యక్తిగత సమస్యలతో ప్రెజర్ గా ఫీలయ్యే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు
- సమస్యలు విని పరిష్కరించేందుకు నలుగురు సభ్యులతో టీం
- విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గిస్తూ, మనోస్థైర్యాన్ని పెంపొందించేలా చర్యలు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ లో జరిగిన చిన్న ఘటన.. ఓ విద్యార్థినిని మానసికంగా కుంగదీసింది. స్నేహితుల మధ్యకు వెళ్లలేని స్థితికి చేర్చి, ఆమెను మరణం వైపు నడిపించింది. ఆత్మహత్య చేసుకున్న కేయూ స్టూడెంట్ శ్రీవిద్య విషయంలోనే కాదు.. ఎంతోమంది విద్యార్థుల మరణానికి చిన్నచిన్న ఘటనలే కారణమవుతున్నాయి.
పరీక్షల భయం, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మన్యూనత భావానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, స్టూడెంట్ సూసైడ్స్ కు చెక్ పెట్టేందుకు కాకతీయ యూనివర్సిటీ అధికారులు సంకల్పించారు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించి, ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకు 'చేతన' పేరుతో మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నలుగురు సభ్యులతో కౌన్సిలింగ్ టీమ్ ను కూడా నియమించారు.
సమస్యలు వింటరు.. సాల్వ్ చేస్తరు..
ఉన్నత విద్యను పొందడంతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఎంతోమంది యూనివర్సిటీల్లో చేరుతుంటారు. అందులో కొంతమంది చదువుల ఒత్తిడి, సీనియర్ల వేధింపులు, నిరుద్యోగం, ఇతర సమస్యలతో సతమతమవుతుంటారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎలా పరిష్కరించుకోవాలో అర్థంకాక మానసిక సంఘర్షణకు గురవుతుంటారు.
ఇలాంటి వాళ్లు ఆత్మన్యూనత భావానికి గురవుతుంటారు. అదికాస్త అనర్థాలకు దారి తీస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అండగా నిలవడంతో పాటు వారిలో చైతన్యం కల్పించేందుకు కాకతీయ యూనివర్సిటీలో 'చేతన' కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా ఓపిగ్గా వినడంతో పాటు దానిని పరిష్కరించేలా 'we here to hear you' నినాదంతో దీనికి రూపకల్పన చేశారు.
నలుగురు సభ్యులతో స్పెషల్ టీమ్..
కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్, సైకాలజీ హెచ్వోడీ ప్రొ.వి.రామచంద్రం ఆలోచనమేరకు సోషియాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ ప్రొ.మారోజు స్వర్ణలత నేతృత్వంలో సైకాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన డా.సంపత్ రెడ్డి, డా.మాలతి, మరొక అసిస్టెంట్ రిజిస్ట్రార్ సభ్యులుగా 'చేతన' కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించడంతో పాటు స్టూడెంట్ సూసైడ్స్ ప్రివెన్షన్ కోసం ఈ టీమ్ సభ్యులు కృషి చేయనున్నారు. విద్యార్థుల సమస్య, వారి కండీషన్ ను సైకియాట్రిస్ట్ ల సహాయం కూడా తీసుకుంటారు. దీంతో విద్యార్థుల మెంటల్ హెల్త్ క్యూర్ అవడంతో పాటు ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సైకాలజీ బిల్డింగ్ లో దీనిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, తొందర్లోనే పర్మినెంట్ వసతి కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్టూడెంట్లు సూసైడ్స్వైపు ఆలోచించకుండా..
విద్యార్థుల ఆత్మహత్యల వైపు ఆలోచించొద్దనే ఉద్దేశంతో యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం. అందులో అనుభవజ్ఞులైన సైకాలజిస్టులు, ప్రొఫెసర్లు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలి. వాటికి పరిష్కారమార్గం చూపడంతో పాటు అవసరమైన అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
ప్రొ.వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్
