- ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఎక్కువ
- నలుగురు కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే రూ.వెయ్యి కోట్లు
- రూ. 250 కోట్లు దాటిన హెచ్‌ఎండీఏ ఆఫీసర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు
- రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులెవరు పట్టుబడినా..
- అక్రమాస్తులు 100 కోట్లకు పై మాటే.
- అందరూ గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన వారే..
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో ఇటీవల పట్టుబడుతున్న పలువురు అధికారుల అక్రమ సంపాదన చూస్తే కండ్లు బైర్లు కమ్మాల్సిందే. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కీలక అధికారులపై ఏసీబీ జరిపిన దాడుల్లో ఒక్కొక్కరి వద్ద తక్కువలో తక్కువ వంద కోట్ల వరకు ఆస్తులు బయటపడ్డ తీరు సంచలనం సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రజలతో నేరుగా సంబంధాలుండే ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ వంటి శాఖల్లో అవినీతి దందా తారస్థాయికి చేరింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిపై ఫిర్యాదులు వెల్లువ మొదలైంది. ఈక్రమంలో దాడుల సందర్భంగా ఆయా అధికారుల ఇండ్లలో బయటపడ్తున్న బంగారం, నోట్ల కట్టలు, ఆస్తుల పత్రాలు చూసి ఏసీబీ అధికారులకు సైతం మైండ్ బ్లాక్ అవుతోంది.
నలుగురు కాళేశ్వరం ఇంజినీర్ల సంపాదన వెయ్యి కోట్లు..
గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ విభాగంలో చక్రం తిప్పిన కొందరు ఉన్నతాధికారుల అవినీతి బాగోతాలను ఏసీబీ తొలుత బయటపెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన నలుగురు ఇంజనీర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేయగా కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ నలుగురు ఇంజనీర్ల అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకు కన్నా ఎక్కువుంటుందని తేలింది.
కాళేశ్వరం కాంట్రాక్టర్ల కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని, వారి నుంచి కమీషన్ల రూపంలో పొందిన కోట్లాది రూపాయలను వీరు స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ వీరు భారీగా భూములు కొనుగోలు చేసినట్లు పత్రాలు లభ్యమయ్యాయి.
శివబాలకృష్ణ ఆస్తులు రూ.250 కోట్లకుపైగా..
హెచ్‌ఎండీఏ మాజీ అధికారి శివబాలకృష్ణ వ్యవహారం టౌన్ ప్లానింగ్ విభాగంలో వేళ్లూనుకున్న అవినీతికి అద్దం పడుతుంది. హైదరాబాద్ మహానగర పరిధిలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల పేరుతో ఆయన భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టు బయటపడింది. శివబాలకృష్ణ ఇండ్లు, బినామీల ఇండ్లపై జరిగిన దాడుల్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా ఆయన అక్రమాస్తుల విలువ రూ.250 కోట్లకన్నా ఎక్కువేనని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ వేల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పదుల సంఖ్యలో విల్లాలు, వందల ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు పట్టుబడడం విస్మయానికి గురిచేసింది.
రంగారెడ్డి జిల్లాలో హద్దులు దాటిన అవినీతి..
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి హద్దులు దాటిపోయింది. ఈ జిల్లా పరిధిలో ఏ చిన్న స్థాయి రెవెన్యూ అధికారి ఏసీబీకి పట్టుబడినా, వారి అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకన్నా ఎక్కువే ఉంటోంది.
భూముల మార్పిడి, వివాదాస్పద స్థలాల సెటిల్మెంట్లు, ధరణి రికార్డుల తారుమారు వంటి వ్యవహారాల్లో ఈ అధికారులు కోట్లలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్లు, ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా వందల ఎకరాల ఫాంహౌస్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోవడాన్ని బట్టి ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పి..
ప్రస్తుతం ఏసీబీకి చిక్కుతున్న అవినీతిఅధికారులంతా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన వారే కావడం విశేషం. అప్పటి పాలకుల అండదండలతో, రాజకీయ సిఫార్సులతో కీలక పోస్టింగులు పొంది ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని భారీగా లబ్ధి పొందారు. ప్రభుత్వపెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా అప్పట్లో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వీరి అవినీతి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
పట్టుబడింది వీరే...
- ఆనంద్ కుమార్ (ఈఎన్‌సీ, ఎలక్ట్రిసిటీ విభాగం), కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ పనుల పర్యవేక్షణలో కీలక పాత్ర, రూ. 320 కోట్ల విలువైన ఆస్తులు (విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, బినామీ ల్యాండ్స్)
- సుధాకర్‌రెడ్డి (చీఫ్ ఇంజనీర్), ప్రాజెక్ట్ నిర్మాణ ప్యాకేజీలు, బిల్లుల మంజూరులో అవినీతి, రూ. 270 కోట్ల అక్రమాస్తులు (బంగారం, నగదు, వ్యవసాయ భూములు)
- వెంకటేశ్వర్లు (సూపరింటెండింగ్ ఇంజనీర్), క్షేత్రస్థాయి పనుల నాణ్యత, కాంట్రాక్టుల పొడిగింపు వ్యవహారాలు, రూ. 230 కోట్లు, (ఐటీ కారిడార్‌లో కమర్షియల్ స్పేస్, ప్లాట్లు)
- శ్రీనివాసరావు (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), లోకల్ బిల్లింగ్స్, క్లియరెన్స్‌లలో అవినీతి, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వెంచర్లు, అక్రమాస్తులు రూ. 180 కోట్లు.
- సగ్గం అనంత లక్ష్మీకుమార్ (జనరల్ మేనేజర్, హైదరాబాద్ వాటర్ బోర్డ్), నీటి ఎద్దడిని ఆసరా చేసుకుని అనధికారిక వాటర్ ట్యాంకర్ల నెట్‌వర్క్ నడిపి అవినీతి, అక్రమాస్తులు రూ. 100 కోట్లు (నగదు, బంగారం, భూములు, ఫ్లాట్లు).
- మూడ్ కిషన్ (డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్), ట్రాన్స్‌పోర్ట్ శాఖలో అక్రమ వసూళ్లు, బినామీ ఆస్తులు, అక్రమాస్తులు రూ. 100 కోట్లు, (31 ఎకరాల భూమి, ఇంటర్నేషనల్ హోటల్‌లో వాటా, కమర్షియల్ ల్యాండ్, లగ్జరీ కార్లు).
- ఎస్. బాలకృష్ణ (టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, హెచ్‌ఎండీఏ), టౌన్ ప్లానింగ్‌లో అవినీతి, అక్రమాస్తులు రూ. 250 కోట్లు
- ఆకుల జగదీశ్వర్‌రెడ్డి (చీఫ్ ఇంజనీర్, గిరిజన సంక్షేమ శాఖ), గిరిజన సంక్షేమ శాఖలో భవనాలు, రోడ్ల కాంట్రాక్ట్‌లో ముడుపులు, అక్రమాస్తులు రూ. 120 కోట్లు
- జ్యోతి (మున్సిపల్ కమిషనర్, బండ్లగూడ జాగీర్), అక్రమ నిర్మాణాలకు అనుమతులు, ప్రభుత్వ భూముల కబ్జాదారులకు సహకారం, అక్రమాస్తులు రూ. 100 కోట్లు.
- సీహెచ్. కనకరాజు (డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్), వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, క్లియరెన్స్‌లో అవినీతి, అక్రమాస్తులు రూ. 130 కోట్లు
- రమేశ్‌కుమార్ (జాయింట్ డైరెక్టర్, కమర్షియల్ టాక్సెస్), జీఎస్టీ ఎగవేతలు, ఆడిట్ రిపోర్టుల తారుమారు, రూ. 150 కోట్ల అక్రమాస్తులు.
- హరి భూషణ్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్లు, భవనాలు), ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్ల కాంట్రాక్టుల్లో అవినీతి, రూ. 110 కోట్ల అక్రమాస్తులు.
- డి. సత్యనారాయణ రావు (రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్), ట్రావెల్స్, లారీల ఫిట్‌నెస్, పర్మిట్లలో అక్రమ వసూళ్లు, రూ. 105 కోట్ల అక్రమాస్తులు.
- వి. దేవేందర్‌రెడ్డి (చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మేడ్చల్), అక్రమ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు అనుమతులు, అక్రమాస్తులు రూ. 115 కోట్లు.
- పి. రాధాకృష్ణ (సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్), అక్రమ లేఅవుట్లు , వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, అక్రమాస్తులు రూ. 160 కోట్లు.
- బి. విఠల్ (సూపరింటెండింగ్ ఇంజనీర్, కిసాన్‌నగర్), ఐటీ కంపెనీలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు పవర్ కనెక్షన్లలో అవినీతి, అక్రమాస్తులు రూ. 140 కోట్లు.
- ఎం. లక్ష్మీనారాయణ (అడిషనల్ కలెక్టర్, రంగారెడ్డి), వివాదాస్పద భూముల క్లియరెన్స్‌లో అవినీతి, అక్రమాస్తులు రూ. 150 కోట్లు.
- వంశీ మోహన్ (డిప్యూటీ కలెక్టర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి), వివాదాస్పద, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమాస్తులు రూ. 100 కోట్లు
