హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు ఫీల్డ్లో తిరగకుండా.. ప్రాజెక్టులను పట్టించుకోకుండా కేవలం హెడ్ క్వార్టర్స్ లేదా హైదరాబాద్ లో మకాం వేస్తుండడంపై ఆయన మండిపడ్డారు. మంగళవారం జలసౌధలో సీఈలు, క్వాలిటీ కంట్రోల్ అధికారులతో రివ్యూ చేశారు.
ప్రతి అధికారి నుంచి తమ తమ పరిధిలోని ప్రాజెక్టులు, వాటి భద్రతకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. చాలా మంది అధికారులు వివరాలు చెప్పలేకపోవడంపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు క్వాలిటీ కంట్రోల్ విభాగం అత్యంత కీలకమని, ప్రాజెక్టులను సందర్శించకుండా, అక్కడ టెస్టులు చేయకుండా హైదరాబాద్ ఆఫీసుల్లోనే కూర్చుంటే ఎలాగని నిలదీశారు.
మ్యాన్యువల్ ప్రకారం పనులు చేస్తున్నామని అధికారులు చెప్పినా.. భద్రతకు సంబంధించి ఎన్ని ప్రాజెక్టులకు ఎన్ని టెస్టులు చేశారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. ఫీల్డ్‌కు వెళ్లకుండా.. టెస్టులు చేయకుండా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా తెలుస్తుందని అధికారులను ప్రశ్నించారు. సీఈలతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులంతా ఫీల్డ్‌లోనే ఉండాలని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు వారు చేసే పనులపై రిపోర్టులివ్వాలని తేల్చి చెప్పారు. ఫోర్ట్‌నైట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్‌ను సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల క్వాలిటీ రిపోర్టులనూ సబ్మిట్ చేయాలని సమావేశంలో ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు.
