మీరు చేసేది పొదుపేనా? చెక్‌‌ చేస్కోండి

మీరు చేసేది పొదుపేనా? చెక్‌‌ చేస్కోండి

పర్సనల్ ఫైనాన్స్‌‌పై అవగాహన కరువు
గుడ్డిగా ఇన్వెస్ట్‌‌మెంట్లు చేస్తే నష్టమే
బీమా.. రిస్క్‌‌ మేనేజ్‌‌మెంట్​ మాత్రమే

చాలా మంది మనీ దాస్తుంటారు కానీ.. వాటిని ఎక్కడ పెడుతున్నారు? దేనిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్నులు వస్తున్నాయి. ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్స్‌‌లో ఏది బెస్ట్? ఇలాంటి విషయాల్లో అవగాహన ఉండటం లేదు. కేవలం డబ్బును బ్యాంకు సేవింగ్స్​ ఖాతాలో వేసి అదే పొదుపని అనుకుంటున్నారు. డబ్బున్నంత మాత్రాన సరిపోదు, దాని ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లానింగ్‌‌, పర్సనల్ ఫైనాన్స్ తెలిసి ఉండటం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ఒక స్పెషల్​ స్టోరీ.

వెలుగు, బిజినెస్‌‌ డెస్క్‌‌: ఒక 30 ఏళ్ల మహిళ తాను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి అంటే తొమ్మిదేళ్ల నుంచి రూ.32 లక్షలకు పైగా బ్యాంక్ అకౌంట్‌‌లో దాచింది. కానీ ఆ మనీ విషయంలో సరైన ఇన్వెస్ట్‌‌ మెంట్ ప్లానింగ్ లేక సతమతమై ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకి వెళ్లింది. తనకు 21 ఏళ్ల వయసున్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నానని పేర్కొంది. చాలా మంది లాగే తాను కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో డబ్బులు పెట్టానని, కొన్ని ఇన్వెస్ట్‌‌మెంట్లను పీపీఎఫ్, కొన్నింటిని ఎఫ్‌‌డీల్లో, కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్‌‌లో దాచినట్టు ఆ ఫైనాన్షియల్ ప్లానర్‌‌‌‌కి చెప్పింది. తండ్రి చనిపోయినప్పుడు వారు ఎదుర్కొన్న ఫైనాన్షియల్ సమస్యల వల్ల, మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు, ఫైనాన్షియల్​గా ఇండిపెండెంట్‌‌గా ఉండేందుకు మనీని సేవ్ చేస్తున్నట్టు తెలిపింది.

అయితే ఆ మనీ దాచే విషయంలోనే ఆమెకు సరైన అవగాహన లేక ఫైనాన్షియల్ ప్లానర్‌‌‌‌ను సంప్రదించింది. ఆమె బ్యాంక్‌‌ అకౌంట్‌‌లో ఇప్పటి వరకు రూ.32 లక్షల వరకు దాచినట్టు విని ఆ ఫైనాన్షియల్ ప్లానర్‌‌‌‌ కూడా షాక్ తిన్నారు. అలాగే అవసరం లేని చోట్ల ఆమె ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్టు ఫైనాన్షియల్ ప్లానర్ గుర్తించారు. దీంతో ఆమెకు పర్సనల్ ఫైనాన్స్‌‌పై తగిన అవగాహన కల్పించారు. చాలా మంది ఇన్సూరెన్స్‌‌ను ఇన్వెస్ట్‌‌మెంట్ అనుకుని, దానిలోనే ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అది కేవలం ఒక రిస్క్ మేనేజ్‌‌మెంట్ అని, ఇన్వెస్ట్‌‌మెంట్​గా పరిగణించకూడదని  ప్లానర్ ఆమెకు వివరించారు.

ఈ మూడింటిని పాటిస్తే చాలు…

పీపీఎఫ్‌‌, ఎన్‌‌పీఎస్, మ్యూచువల్  ఫండ్స్‌‌ ప్రధాన పోర్ట్‌‌ఫోలియోగా తీసుకోవాలని సూచించారు. ఇన్సూరెన్స్ కేవలం రిస్క్ మేనేజ్‌‌మెంట్ మాత్రమే. ఇది ఇన్వెస్ట్‌‌మెంట్ కాదని గుర్తించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఇన్సూరెన్స్ పాలసీని రివ్యూ చేసి, టర్మ్‌‌ ప్లాన్ తీసుకోవాలని సూచించారు. అలాగే ఆమె తల్లికి సపరేట్‌‌గా మెడికల్ పాలసీ తీసుకోవాలని పేర్కొన్నారు. సిప్‌‌ల ద్వారా నెలకు రూ.50 వేలను లాంగ్‌‌ టర్మ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లలో పెట్టాలని తెలిపారు. ఇలా పదేళ్ల పాటు కొనసాగించాలని చెప్పారు. మీ దగ్గరున్న అతిపెద్ద ఆస్తే మీ సమయమని కూడా చెప్పామని  ఎస్‌‌ఎల్‌‌ఏ ఫైనాన్షియల్ సొల్యుషన్ ఫౌండర్ ఆశిష్ మోదానీ వివరించారు.