హిందీ వద్దంటే కుదరదు: తమిళనాడుకు సుప్రీం ఆదేశం

హిందీ వద్దంటే కుదరదు: తమిళనాడుకు సుప్రీం ఆదేశం

చెన్నై: తమిళనాడులో హిందీ బోధనపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే మైండ్‌సెట్ మార్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో హిందీ నేర్పించకుండా ఉండటం కుదరదని స్పష్టం చేసింది. కేంద్రీయ నవోదయ పాఠశాలలు రాష్ట్ర విద్యా విధానానికి వ్యతిరేకం కాదని.. కేంద్ర విద్యా విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చలేదని పేర్కొంది. విద్యా విషయంలో పంతానికి పోవద్దని చురకలంటించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తమిళనాడులో హిందీ విద్యా విధానంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ద్విభాషా సూత్రాన్ని (తమిళం, ఇంగ్లీష్) మాత్రమే అనుసరిస్తోంది. కేంద్ర విద్యా విధానమైన త్రిభాషా (తమిళం, ఇంగ్లీష్, హిందీ) సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాడులో  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయితే, కేంద్ర విద్యా విధానంలో భాగంగా తమిళనాడులోని ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ క్రమంలో నవోదయ పాఠశాలల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. గురువారం (సెప్టెంబర్ 17) జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎ.జి. మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో హిందీ బోధించకూడదనే మైండ్‌సెట్ మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించింది.

►ALSO READ | బ్రిక్స్ సదస్సులో ప్రపంచ నేతలకు అస్వస్థత.. నిజం బయటపెట్టిన విదేశాంగ శాఖ

తమిళనాడు గడ్డపై హిందీ బోధించకూడదని అనడం సరికాదని పేర్కొంది. చెన్నై ప్రజలు ఢిల్లీని, అలాగే ఢిల్లీ ప్రజలు చెన్నైని దూరం పెట్టకూడదని పేర్కొంది. చదువు విషయంలో పట్టుదలకు పోవద్దని మందలించింది. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో భాషా విధానంపై చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు 3 నెలల్లోగా తగిన స్థలాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 2026, డిసెంబర్ 14కు వాయిదా వేసింది.