ఇచ్చిన గొర్రెలన్నీ ఏమాయె?..ఏడాదిలో 63లక్షల గొర్రెలు తగ్గినయ్

ఇచ్చిన గొర్రెలన్నీ ఏమాయె?..ఏడాదిలో 63లక్షల గొర్రెలు తగ్గినయ్
  • రాష్ట్రంలో 2017 నుంచి గొర్రెల పంపిణీ స్కీమ్​
  • సుమారు 77 లక్షల మేర పంపిణీ
  • కొత్తవి, పాతవి, పిల్లలు కలిపి రెండు కోట్ల 20 లక్షలకుపైగా ఉంటయన్న ఆఫీసర్లు
  • ఇప్పుడేమో కోటీ 60 లక్షల గొర్రెలకే నట్టల మందు
  • వంద శాతం గొర్రెలకు వేశామన్న అధికారులు
  • గొర్రెలు పెరిగితే మటన్​ ధర తగ్గాలె.. కానీ ఈ మూడేండ్లలో డబులైంది

హైదరాబాద్‌, వెలుగుగొర్రెల పంపిణీ స్కీమ్ తో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య బాగా పెరిగిందని, ఎంతో మందికి లాభం కలిగిందని ఓవైపు సర్కారు చెప్తోంది. మరోవైపు రాష్ట్రంలో గొర్రెలే దొరకడం లేదని వ్యాపారులు మొత్తుకుంటున్నరు. ఇంకోవైపు మటన్​ రేట్లు బాగా పెరిగిపోయినయి. మరి గొర్రెల సంఖ్య బాగా పెరిగితే మటన్​ రేట్లు తగ్గాలె, లేకుంటే అంతే ఉండాలెకదా అని జనం వాపోతున్నరు. గొర్రెల పంపిణీ మొదలైన 2017లో మటన్​ కిలో రేటు రూ.450 దాకా ఉంటే.. ఇప్పుడు రూ.800 వరకు పెరిగిందని అంటున్నరు. అసలు పశుసంవర్ధక శాఖ లెక్కలు చూస్తేనేమో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య తగ్గిపోతూనే ఉందని స్పష్టంగా తెలుస్తోంది.రాష్ట్రంలో పశువులకు గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా 63 లక్షల గొర్రెలు తగ్గిపోయినట్టు తేలింది.

నట్టల మందు పంపిణీ లెక్కలతో

గొర్రెలకు, మేకలు, ఇతర పశువులకు రోగాలు రాకుండా సర్కారు ఏటా రెండు సార్లు నట్టల మందు పంపిణీ చేస్తుంది. దీన్ని డీవార్మింగ్​ అంటారు. ప్రతి ఊర్లో గొర్రెలు, మేకలకు ఈ మందు వేస్తారు. గత ఏడాది జనవరి 8 నుంచి 15 తేదీ వరకు జరిగిన ప్రోగ్రామ్​లో రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 21 లక్షల 38 వేల 659 గొర్రెలకు నట్టల మందు వేశారు. తర్వాత ఆరు నెలలకు (2019 జూన్‌‌ లో) మరో దఫాగా కోటీ 74 లక్షల 32 వేల 214 గొర్రెలకు మందు వేశారు. అంటే ఆరు నెలల్లోనే 46 లక్షల 65 వేల గొర్రెలు తగ్గిపోయాయి. ఇక ఈ ఏడాది జనవరిలో కోటీ 58 లక్షల 42 వేల 651 గొర్రెలకు డీవార్మింగ్‌‌ చేశారు. అంటే మరో 16 లక్షల 30 వేల గొర్రెలు తగ్గిపోయాయి. మొత్తంగా ఏడాదిలో దాదాపు 63 లక్షల గొర్రెలు తగ్గినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి.

మటన్​ రేట్లెందుకు పెరుగుతున్నయ్?

రాష్ట్రంలో కొద్దినెలలుగా మటన్​ రేట్లు బాగా పెరిగాయి. మేకలు, గొర్రెలు దొరకడం లేదని.. దానివల్లే డిమాండ్​కు తగినట్టుగా మటన్​ రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్​ వర్గాలు చెప్తున్నాయి. సర్కారు చెప్తున్న ప్రకారం అయితే రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగి ఉంటే.. డిమాండ్‌‌కు అనుగుణంగా ప్రొడక్షన్‌‌ ఉన్నట్టేనని, వాస్తవంగా ప్రొడక్షన్‌‌  అంతగా లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా లాక్‌‌ డౌన్‌‌ పీరియడ్​లో ఈ విషయం బయటపడిందని అంటున్నాయి. లాక్‌‌ డౌన్‌‌ టైంలో రాష్ట్రాల మధ్య గొర్రెలు, మేకల రవాణా ఆగిపోయింది. దాంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని మండీల వ్యాపారులు మేకలు, గొర్రెల కోసం జిల్లాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లినా సరిపడా లైవ్​స్టాక్​ దొరకలేదు. రాష్ట్రంలో గొర్రెల కొరత ఉందని గుర్తించి, రేట్లు పెంచేశారు. దాంతో మటన్​ రేట్లు మరింతగా పెరిగాయి. రాష్ట్రంలో 2017 జూన్‌‌ 20న గొర్రెల పంపిణీ స్కీం ప్రారంభం కాగా.. అప్పట్లో మటన్‌‌ రేటు రూ.450 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.800 దాటింది. అంటే మూడేండ్లలోనే రేటు దాదాపు డబుల్​ అయింది.

వందశాతం పంపిణీ చేస్తే..

రాష్ట్రంలో వంద శాతం గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేశామని పశు సంవర్థకశాఖ అధికారులు చెప్తున్నారు. 2017–18 సంవత్సరంలో రాష్ట్రంలో కోటీ 20 లక్షల గొర్రెలు ఉన్నాయని.. 2017 జూన్‌‌ 20 నాటికి కొత్తగా 3.70 లక్షల గొర్రెల యూనిట్లు (76 లక్షల 94 వేల గొర్రెలు) పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నారు. ఈ పథకం ద్వారా పంపిణీ చేసిన గొర్రెలకు కోటీ ఎనిమిది లక్షల పిల్లలు పుట్టాయని అంచనా వేశారు. మొత్తంగా రాష్ట్రంలో 2019–20 నాటికి 2 కోట్ల 8 లక్షల గొర్రెలు ఉన్నాయని.. 57.8 శాతం పెరిగాయని లెక్కలు చెప్పారు. పక్కాగా లెక్క తీస్తే రాష్ట్రంలో కోటీ 40 లక్షల కంటే ఎక్కువ గొర్రెలు ఉండవని గొర్రెల కాపర్ల సంఘాల నేతలు అంటున్నారు. రాష్ట్రంలో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లలో 70 శాతం వాటిల్లో పొట్టేలను పంపిణీ చేయలేదని, మరి గొర్రెలెట్లా పుట్టాయని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో 148కి చేరిన కరోనా మరణాలు