మాక్ అసెంబ్లీకైనా కేసీఆర్ వస్తే బాగుండేది : మంత్రి సీతక్క

మాక్ అసెంబ్లీకైనా కేసీఆర్ వస్తే బాగుండేది : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, కనీసం ఆ కార్యక్రమానికైనా కేసీఆర్ వస్తే బాగుండేదని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. చట్టసభలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎర్రవల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్పీ సమావేశం నిర్వహించిన కేసీఆర్, పార్టీ కార్యాలయంలో జరిగిన మాక్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీకి రాని కేసీఆర్, సొంత పార్టీ పెట్టిన మాక్ అసెంబ్లీకి కూడా హాజరుకాకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియెట్‌‌‌‌కు రాలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రావడం లేదని మండిపడ్డారు.

తామున్న చోటికే అన్నీ రావాలనుకోవడం దొరల అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. దళిత సంఘాలు నిరసన తెలిపినప్పుడు ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనను గుర్తుచేశారు. చట్టసభలను, సభాపతిని కించపరుస్తున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, వారి ప్రతిపక్ష హోదాను కూడా ప్రజలే ఊడగొడతారని సీతక్క హెచ్చరించారు.