నోటీసులిస్తరో.. సస్పెండ్ చేస్తరో మీ ఇష్టం : సర్పంచులు

నోటీసులిస్తరో.. సస్పెండ్ చేస్తరో మీ ఇష్టం : సర్పంచులు
  • మండల సమావేశంలో సర్పంచులు

నేలకొండపల్లి, వెలుగు: అందినకాడికల్లా అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధి పనులు చేస్తే.. బిల్లులు చెల్లించకపోవడంతో బయట తిరగలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిషత్ ఆఫీసులో శనివారం ఎంపీపీ రమ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హాజరయ్యారు. సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు గండు సతీశ్​మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏడు నెలలుగా రూపాయి కూడా ఇవ్వకుండా సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. చాలామంది సర్పంచులు పుస్తెల తాడు తాకట్టి పెట్టి అభివృద్ధి పనులు చేయించారని అన్నారు. సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచుల కుటుంబాల్లో చిచ్చు రగులుతోందన్నారు. బకాయిలు చెల్లించేవరకు సర్పంచులు పనులు చేసేది లేదన్నారు. నోటీసులు ఇస్తారో సస్పెండ్ చేస్తారో మీ ఇష్టం అని అన్నారు. 

అమ్మగూడెం సర్పంచుగా ఉన్న తాను నాలుగు ఎకరాలు అమ్మేశానని చెప్పారు. అధికారులు తమ పరిస్థితి గురించి ఆలోచించాలని, పనులు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తేవొద్దని వేడుకున్నారు. ఎమ్మెల్సీ చొరవ తీసుకుని బిల్లులు ఇప్పించడంతోపాటు సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందించకపోవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీడీవో జమలారెడ్డి, -తహసీల్దార్ దారా ప్రసాద్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.