ఉపాధి సిబ్బందికి సర్కార్ నజరానా!

ఉపాధి సిబ్బందికి సర్కార్ నజరానా!
  •     అత్యధిక మందికి పని కల్పిస్తే రూ.వెయ్యి బహుమతి

హైదరాబాద్‌, వెలుగు: ఉపాధి హామీ పథకంలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది.  గ్రామాల్లో కూలీలకు అత్యధిక సంఖ్యలో పని కల్పించి, నిబంధనల ప్రకారం హాజరు నమోదు చేసే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాలో రోజూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు సిబ్బందికి (ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా మేట్లు) రూ.1,000 చొప్పున బహుమతి అందించాలని ఆదేశించింది. 

ఈ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.50 కోట్ల పని దినాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కూలీలను పని ప్రదేశాలకు రప్పించడంతోపాటు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్​ఎంఎంఎస్​) యాప్ ద్వారా సక్రమంగా హాజరు నమోదు చేసేలా క్షేత్ర సహాయకులు, మేట్లను సమాయత్తం చేసేందుకు ఈ నగదు పురస్కారాలను ప్రకటించింది. 

జిల్లాలో రోజుకు ఇద్దరు సిబ్బందిని ఎంపిక చేస్తారు. వారికి రూ.1,000 బహుమతిని జిల్లాలో అందుబాటులో ఉన్న నిధుల నుంచి అందజేస్తారు. ఒక గ్రామానికి ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల లోపు ఎంపికైన సిబ్బంది వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు.  పని ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రోగ్రాం అధికారులకు ప్రభుత్వం సూచించింది.