స్థానిక రైతులను ముంచుతున్న మిల్లర్లు!.. ఏపీ వడ్లకు అధిక ధర.. లోకల్ ధాన్యానికి కోత

స్థానిక రైతులను ముంచుతున్న మిల్లర్లు!.. ఏపీ వడ్లకు అధిక ధర.. లోకల్ ధాన్యానికి కోత
  • దళారులతో కుమ్మక్కై సిండికేట్‌‌‌‌గా మారిన రైస్ మిల్లర్లు?
  • బోనస్ కోసం పొరుగు రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యం తరలింపు
  • రోజుల తరబడి మిల్లుల వద్దే పడిగాపులు కాస్తున్న రైతులు
  • ఏపీ నుంచి వచ్చే వడ్లను అడ్డుకోవాలని డిమాండ్​

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సన్న వడ్ల కొనుగోలులో మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. వరి కోతలు ముమ్మరం కావడంతో మిల్లర్లు దోపిడీకి తెరలేపారు. స్థానిక రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మిల్లులకు తీసుకొస్తే, పచ్చ గింజ సాకుతో మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గంటల నుంచి రోజుల తరబడి స్థానిక రైతుల ట్రాక్టర్లను దిగుమతి చేసుకోకుండా నిలిపివేస్తూ, ఏపీ నుంచి వస్తున్న లారీలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అక్రమ మార్గంలో ఏపీ ధాన్యం రవాణా

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటిస్తుండటంతో, దళారులు దీనిని ఆసరాగా చేసుకుంటున్నారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా ఇక్కడి మిల్లులకు తరలిస్తున్నారు. తనిఖీలకు చిక్కకుండా విజయవాడ-, హైదరాబాద్ జాతీయ రహదారిని కాకుండా, ఖమ్మం జిల్లాలోని అంతర్గత రహదారుల ద్వారా రాత్రి వేళల్లో గ్రూపులుగా లారీలను రవాణా చేస్తున్నారు. శుక్రవారం ఆలగడప టోల్ గేట్ వద్ద కొన్ని లారీలను అధికారులు పట్టుకున్నా, గంటల వ్యవధిలోనే వాటిని వదిలివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ధరల వ్యత్యాసంతో నిలువు దోపిడీ..

పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యానికి క్వింటాకు రూ. 2,430 వరకు చెల్లిస్తున్న మిల్లర్లు, స్థానిక రైతుల వద్దకు వచ్చేసరికి రూ. 2,100 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో క్వింటాకు రూ. 3 వేలు పలికిన ధరను, ఇప్పుడు సిండికేట్‌‌‌‌గా మారిన మిల్లర్లు ఏకపక్షంగా రూ. 2,700కి, ఆపై మరింత తక్కువకు తగ్గించేశారు. ఏపీ ధాన్యం వల్ల మిల్లుల్లో నిల్వ సామర్థ్యం లేదని సాకులు చెబుతూ, స్థానిక రైతులను భయపెట్టి తమకు నచ్చిన ధరకే అమ్ముకునేలా ఒత్తిడి తెస్తున్నారు.

రైతుల పడిగాపులు..

ఒక్కో రైస్ మిల్లు వద్ద ప్రస్తుతం 200 నుంచి 250 ట్రాక్టర్లు నిలిచిపోయి ఉన్నాయి. రోజుకు వేల టన్నుల ధాన్యం దిగుమతి చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను వేగంగా ఖాళీ చేస్తూ, స్థానిక రైతుల ట్రాక్టర్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితితో రైతులు మిల్లుల వద్దే రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. ప్రశ్నిస్తే ‘ఇష్టముంటే అమ్మండి.. లేదంటే వెళ్లిపోండి’ అంటూ మిల్లర్లు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

అధికారులు జోక్యం చేసుకోవాలి.. 

స్థానిక రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి, దళారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మిల్లర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే అక్రమ ధాన్యాన్ని అరికట్టాలని, స్థానిక రైతుల ధాన్యం కొనుగోలుకు మొదటి ప్రాధాన్యం  ఇచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చూడాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం సూర్యాపేట, ఇతర జిల్లాల నుంచి  ఆలగడప టోల్ గేట్ మీదుగా  మిర్యాలగూడ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ధాన్యం లారీలు  వస్తున్న విషయమై  సమాచారం అందుకున్న   సివిల్ సప్లై, పోలీస్ శాఖ అధికారులు కొన్ని లారీలను తనిఖీ చేసి పట్టుకున్నారు.  

వేములపల్లి మండల పరిధిలోని ఓ రైస్ మిల్లుకు సుమారు 60 లారీల తరలినట్లు  సివిల్ సప్లై అధికారులు తెలిపారు. కాగా, టోల్ గేట్ వద్ద  పట్టుబడిన లారీలను గంటల వ్యవధిలో వదిలివేయటం  పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేయకుండా, క్షేత్రస్థాయిలో మిల్లర్ల సిండికేట్‌‌‌‌ను అరికట్టాలని కోరుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూస్తున్నాం.. 

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తుందని సమాచారంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆలగడప టోల్​గేట్​ వద్ద  తనిఖీలు చేపట్టాం. సూర్యాపేట జిల్లా నుంచి అత్యధికంగా 60 లారీల వరకు మిర్యాలగూడలోని మిల్లులకు ధాన్యం లోడులు రావడంతో, వాటిని పరిశీలించి అనుమతిచ్చాం. ఏపీ నుంచి అక్రమంగా ధాన్యం లోడులను తీసుకొచ్చిన కొన్ని లారీలను వెనక్కి పంపాం. - సైదులు, సివిల్​ స్లపై డిప్యూటీ తహసీల్దార్​