వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యాక అమెరికా నౌకలు తొలిసారి హార్మూజ్‌జలసంధి మీదుగా ప్రయాణించాయని సమాచారం. అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు అమెరికా నేవీ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు శనివారం హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఆరు వారాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలమార్గం మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించడం ఇదే మొదటిసారి అని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్ట్ చేసింది.
ఎలాంటి ఇబ్బంది లేకుండా నౌకలు హార్మూజ్మీదుగా ప్రయాణించాయని.. ఈ చర్యను నౌకాయాన స్వేచ్ఛ మిషన్‌గా అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. ఇవి వాణిజ్య నౌకలకు రక్షణగా వెళ్లడం లేదని అధికారులు స్పష్టం చేశారు. నేవీకి చెందిన రెండు క్షిపణి విధ్వంసక నౌకలు హార్మూజ్‌జలసంధి మీదుగా ప్రయాణించాయని అమెరికా చెబుతున్నది. అయితే, ఈ వార్తను ఐఆర్ జీసీ ఖండించినట్లు సమాచారం.
అమెరికా, ఇరాన్ దేశాలకు చెందిన సంప్రదింపుల బృందాలు పాకిస్తాన్ వేదికగా సమావేశమై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నౌకలు హార్మూజ్ మీదుగా వెళ్లడం సానుకూల సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పట్టుబట్టిన సంగతి తెలిసిందే.
వెనక్కి తగ్గని ఇజ్రాయెల్
అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
దాడులను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ శనివారం కూడా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
