న్యాయస్థానాన్ని రాజకీయాల్లోకి లాగకండి: విద్యార్థుల లాఠీచార్జ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యాయస్థానాన్ని రాజకీయాల్లోకి లాగకండి: విద్యార్థుల లాఠీచార్జ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: నీట్ 2026 పేపర్ లీక్‎కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తోన్న ఆందోళనపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు తీవ్రస్థాయిలో బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది.

అసలేం జరిగిందంటే..?

నీట్ 2026 పేపర్ లీక్‎, విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. 

నిరసనను అణిచివేసేందుకు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల మితిమీరిన బల ప్రయోగాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‎పై అత్యవసర విచారణ చేపట్టి ఆందోనకారులకు న్యాయ సహయం అందించాలని పిటిషనర్ అభ్యర్థించారు. 

మంగళవారం (జులై 21) ఈ పిటిషన్‎ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి రాజకీయ, వీధి పోరాటాల వివాదాల్లోకి న్యాయవ్యవస్థను లాగొద్దని పిటిషనర్‎ను ధర్మాసనం మందలించింది. ఈ పిటిషన్‌ను బుధవారం (జూలై 22) సాధారణ ప్రక్రియలో భాగంగా విచారణకు స్వీకరిస్తామని కోర్టు పేర్కొంది.