జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్ : స్పీకర్ గడ్డం ప్రసాద్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్ : స్పీకర్ గడ్డం ప్రసాద్
  •     బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వేసిన అనర్హత పిటిషన్ కొట్టివేత 
  •     కడియం శ్రీహరిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన స్పీకర్

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలోని ట్రిబ్యునల్ హాల్ లో స్పీకర్ ఈ తీర్పును ప్రకటించారు. సంజయ్ పార్టీ మారారని ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ ను స్పీకర్ కొట్టేస్తూ ఈ తీర్పును వెల్లడించారు. గత నెలలోనే సంజయ్ పై విచారణను పూర్తి చేసిన స్పీకర్.. ఆ తీర్పును రిజర్వ్ లో ఉంచారు.  

మొత్తం పదిమంది పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో సంజయ్​తో కలిపి ఇప్పటివరకు  8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ ఉన్నారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై విచారణ సాగుతోంది. 

ఇందులో దానం నాగేందర్ విచారణను ఈ నెల 18 కి వాయిదా వేయగా, బుధవారం జరగాల్సిన కడియం శ్రీహరి విచారణను కూడా స్పీకర్ ఈ నెల 19 కి వాయిదా వేశారు. బుధవారం విచారణకు రావాలని ఇటు కడియం శ్రీహరి, అటు  ఆయనపై  అనర్హత పిటిషన్ వేసిన కేపీ వివేకానంద తరఫు అడ్వకేట్లకు స్పీకర్ మంగళవారం నోటీసులు పంపించారు. అయితే, ఇరువర్గాల అంగీకారం మేరకు ఈ కేసును స్పీకర్ ఈ నెల 19 కి వాయిదా వేశారు.