- వానాకాలం క్రాప్ లోన్ టార్గెట్ రూ.1,693కోట్లు
- జగిత్యాల జిల్లాలో రుణ ప్రణాళిక ఖరారు చేసిన అధికారులు
- గతేడాదితో పోల్చితే రూ.153 కోట్లు అదనంగా కేటాయింపు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్‌కు పంట రుణ ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. ఈ సీజన్‌లో 86,284 మంది రైతులకు రూ.1,693 కోట్ల పంట రుణాలు అందించాలని నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే రూ.153 కోట్ల అదనపు లక్ష్యాన్ని ప్రకటించారు. వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న జగిత్యాలలో సాగు వ్యయాలు పెరుగుతుండటంతో ఈసారి పంట రుణాల లక్ష్యాన్ని పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.
2026-–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం 1,43,793 మంది రైతులకు రూ.2,821.52 కోట్ల వ్యవసాయ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాగా జిల్లాలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1,153.06 కోట్లు, 9 ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.122.85 కోట్ల రుణాలు ఇవ్వనున్నాయి. జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రూ.210.91 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రూ.206.10 కోట్ల రుణాలు అందనున్నాయి. కాగా మిగతా ప్రైవేట్ బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు, అర్హతల పేరుతో దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి.
అర్హులందరికీ రుణాలు
పంట రుణాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ తెలిపారు. పాత రుణాలు చెల్లించిన రైతులకు కొత్త రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదైన భూమి విస్తీర్ణం ఆధారంగా అర్హులైన ప్రతి రైతుకు పంట రుణం అందిస్తామని పేర్కొన్నారు. రుణాల మంజూరులో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు.
