ఫీజు రీయింబర్స్మెంట్అమలు చేయాలి..లేదంటే కాక్రోచ్ తరహా ఉద్యమం చేస్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్

ఫీజు రీయింబర్స్మెంట్అమలు చేయాలి..లేదంటే కాక్రోచ్ తరహా ఉద్యమం చేస్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్ అమలు చేయకపోతే కాక్రోచ్ తరహా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని బీసీ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. దేశంలో జెన్  జీ ఉద్యమం ముగిసిపోలేదని.. అవినీతి, బంధుప్రీతి, వారసత్వ, ధన రాజకీయాలు ఉన్నంత వరకు వివిధ రూపాల్లో కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే, ఇక్కడ కూడా కాక్రోచ్ తరహా ఉద్యమం చేస్తామన్నారు. 

యువశక్తిని ఢిల్లీ పాలకులు తక్కువ అంచనా వేశారని తెలిపారు. కాక్రోచ్ ల రూపంలో మొదలైన జెన్  జీ ఉద్యమం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో మొదలవుతుందన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఫీజు రీయింబర్స్​మెంట్  అమలు కాకపోవడం, ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో స్టూడెంట్స్ ను కాలేజీ యజమాన్యాలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులతో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వచ్చే నెల 15 నాటికి ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు రిలీజ్​ చేయకపోతే చలో హైదరాబాద్  చేపడతామని హెచ్చరించారు.