జలసిరి: మహిళల చేతుల్లోకి నీటికుంటలు.. వ్యవసాయరంగం మరింత లాభదాయకం

జలసిరి: మహిళల చేతుల్లోకి నీటికుంటలు.. వ్యవసాయరంగం మరింత లాభదాయకం
  • ‘జలసిరి’ కింద రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పాంపాండ్ల నిర్మాణం
  • ఆగస్టు 15 నాటికి తొలి విడత
  • 25 వేల కుంటలు పూర్తి లక్ష్యం
  • మహిళా సంఘాల సభ్యులకు తొలి ప్రాధాన్యం
  • ఒక్కో కుంటకు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు మంజూరు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలసిరి కార్యక్రమంలో భాగంగా వీబీ జీ రామ్​జీ స్కీమ్ అనుసంధానంతో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పంట కుంట(పాం పాండ్)ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడత కింద వచ్చే ఆగస్టు 15 నాటికి 25 వేల పాం పాండ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 ఈ పథకంలో వ్యవసాయ భూమి కలిగిన మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీ) సభ్యులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం సొంత భూమి ఉన్న దాదాపు లక్ష మందికిపైగా సభ్యుల వివరాలను ప్రభుత్వం సేకరించి, ఇప్పటికే జిల్లాలకు అందజేసింది. పంట కుంటల తవ్వకానికి అవసరమయ్యే కూలి ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. 

భూమి పరిమాణం, కుంట పరిమాణాన్ని బట్టి ఒక్కో పంట కుంట నిర్మాణానికి సుమారు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు మంజూరు చేయనున్నారు. ఒక్కో కుంట తవ్వకానికి కనీసం 400 పనిదినాలు పట్టనుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రూ.వందల కోట్ల విలువైన ఉపాధి లభించనుంది. 

కాగా, వర్షపు నీరు వృథా కాకుండా పొలంలోనే నిల్వ ఉంచడం ద్వారా రైతులకు మేలు జరుగనుంది. అత్యవసర సమయంలో ఈ నీరు పంటలకు ఉపయోగపడుతాయి. ఈ కుంటల వల్ల భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. సాగు నీటి అవసరాలతో పాటు కుంటల్లో చేపల పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.

ఉత్పత్తి రంగంలో మహిళల భాగస్వామ్యమే లక్ష్యం

మహిళలను కేవలం పొదుపు సంఘాలకే పరిమితం చేయకుండా, సొంత భూమి ఉన్న ప్రతి మహిళ వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళల సాధికారత అంటే సంక్షేమ పథకాలు అందించడమే కాదు.. ఉత్పత్తి, ఉపాధి, సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేయడమే నిజమైన సాధికారత. అర్హులైన మహిళా సంఘాల సభ్యులు పంట కుంటల నిర్మాణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

– మంత్రి సీతక్క -