కాశ్మీర్​లో ముగ్గురు టెర్రరిస్టుల అరెస్ట్ .. వివరాలు వెల్లడించిన జమ్మూకాశ్మీర్ డీజీపీ

కాశ్మీర్​లో ముగ్గురు టెర్రరిస్టుల అరెస్ట్ .. వివరాలు వెల్లడించిన జమ్మూకాశ్మీర్ డీజీపీ
  • ఈ నెల9న శ్రీనగర్​లో కానిస్టేబుల్​ను కాల్చింది వీళ్లే

శ్రీనగర్: పోలీసుపై దాడి చేసిన ముగ్గురు హైబ్రీడ్ టెర్రరిస్టులను జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 9న కానిస్టేబుల్ మహ్మద్ హఫీజ్​ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శ్రీనగర్​లోని బెమీనా ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరపగా కానిస్టేబుల్​కు 3 బులెట్లు తగిలాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. 

కుట్ర పన్నింది పాకిస్తాన్​ టెర్రిస్టులే

పాకిస్తాన్​కు చెందిన అర్జుమంద్ అలియాస్ హమ్జా బుర్హాన్​ ఈ కుట్ర పన్నాడని కాశ్మీర్ డీజీపీ స్వైన్ మీడియాకు వెల్లడించారు. కాశ్మీర్​ పోలీసులపై దాడి చేసేందుకు శ్రీనగర్​కు చెందిన డానిష్ అహ్మద్​ మల్లాను హమ్జా సంప్రదించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతడు కానిస్టేబుల్ నివాసం ఉండే బెమీనా ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ ఖండే, మోహనాన్ ఖాన్​ను రిక్రూట్ చేసుకున్నాడని, ముగ్గురూ కలిసి పోలీసులను చంపేందుకు స్కెచ్​ వేశారని వివరించారు. కొద్దిరోజుల ముందు నుంచీ ఇంతియాజ్, మోహనాన్ రెక్కీ నిర్వహించి కానిస్టేబుల్​ను కాల్చారని చెప్పారు.

ప్రస్తుతం ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి లేటెస్ట్ వెర్షన్ పిస్టల్, 57 బులెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దాడికి కానిక్ టీపీ9 అనే మేడిన్ టర్కీ పిస్టల్​ను ఉపయోగించారని, ఇది లైట్ వెయిట్​తో కూడిన చాలా క్వాలిటీ కలిగిన వెపన్ అని వివరించారు. ఇలాంటి ఆయుధాలను బార్డర్​ల నుంచి చిన్న డ్రోన్​ల ద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులు మనదేశానికి అక్రమంగా చేరవేస్తున్నారని డీజీపీ వెల్లడించారు.