Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో కమలానికి ‘జనసేన’ చిక్కులు...ఒంటరిగా బరిలో నిలిచిన క్యాండిడేట్లు..

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో కమలానికి ‘జనసేన’ చిక్కులు...ఒంటరిగా బరిలో నిలిచిన క్యాండిడేట్లు..
  • కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో 14, రామగుండంలో 35 డివిజన్లలో పోటీ
  • కొన్ని చోట్ల గ్లాస్‌‌‌‌‌‌‌‌ గుర్తుపై బీజేపీ రెబల్స్‌‌‌‌‌‌‌‌ 
  • బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్న పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌
  • అయోమయంలో ఇరు పార్టీల నాయకులు

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కమలం పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడింది. ఏపీలో భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన.. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో మాత్రం వేర్వేరుగా పోటీకి దిగుతున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కని వారు జనసేన తరఫున బరిలోకి దిగి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ ఫొటోతో ప్రచారం చేస్తున్నారు. 

దీంతో జనసేన కారణంగా చీలే ఓట్లు బీజేపీకే నష్టం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు.. కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌‌‌‌‌‌‌‌రావు విజ్ఞప్తి మేరకు బీజేపీ తరఫున ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలో పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ ప్రచారం చేస్తారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇరు పార్టీల క్యాండిడేట్లలో అయోమయం నెలకొంది.

మున్సిపల్ ఎన్నికల ద్వారా జనాల్లోకి జనసేన

జనవరి 3న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు వచ్చారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే.. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సాగర్ ప్రకటించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో 60 డివిజన్లకుగాను అత్యధికంగా 35 డివిజన్లలో జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచారు. 

కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ లో 14 డివిజన్లలో జనసేన పోటీ చేస్తుండగా.. వీరిలో 24వ డివిజన్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగా బీజేపీ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పట్టణ మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన బీజేపీ టికెట్ ఆశించినప్పటికీ రాకపోవడంతో జనసేన తరఫున బరిలో నిలిచారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో, సిరిసిల్లలో 7, వేములవాడలో 5, చొప్పదండి, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో 2 వార్డుల చొప్పున జనసేన క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. 

జగిత్యాల మున్సిపాలిటీలో ముగ్గురు, మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో 12 మంది, కోరుట్ల, ధర్మపురి, రాయికల్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీల్లో ఆరుగురి చొప్పున కలిపి జగిత్యాల జిల్లాలో మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 110 మంది క్యాండిడేట్లు జనసేన తరఫున బరిలో నిలిచారు. 

జనసేన లేని చోటే బీజేపీకి మద్దతు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకే తాము మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆ పార్టీ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి రాజిరెడ్డి చెప్పారు. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. ఏదైనా ఒకే వార్డులో జనసేన, బీజేపీ క్యాండిడేట్లు పోటీ చేస్తే.. అక్కడ జనసేనకే ఓటేయమని ప్రచారం చేయనున్నారు. 

జనసేన పార్టీ తరఫున క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ బరిలో లేని చోట మాత్రమే బీజేపీ అభ్యర్థులకు మద్దతిస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందకు పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు రాజిరెడ్డి తెలిపారు.