- పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
జనగామ అర్బన్, వెలుగు : జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా సత్వరమే మిల్లులకు తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ జనగామ మండలంలోని వడ్లకొండ, నర్మెట్ట మండలంలోని హనుమంతాపూర్, అనంతరం తరిగొప్పుల, చిల్పూర్ మండలాల పరిధిలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, వెంకటాద్రిపేట, మల్కాపూర్, చిల్పూర్ గుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోకుండా వేగవంతమైన రవాణా చర్యలు చేపట్టి వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రవాణా కోసం కేవలం లారీలపైనే ఆధారపడకుండా అవసరమైతే ఇతర వాహనాలను వినియోగించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కేంద్రాల్లో ఉన్న నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలతో కూడిన నివేదికలను ప్రతిరోజూ సమర్పించాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని, చివరి గింజ వరకు ధాన్యం మిల్లులకు చేరేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టర్ స్వయంగా కొనుగోలు కేంద్రాల రిజిస్టర్లను తనిఖీ చేసి రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించబోమని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు
స్పష్టం చేశారు.
