సంజయ్.. పక్క సంసారాల్లో చిచ్చు పెట్టకు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సంజయ్.. పక్క సంసారాల్లో చిచ్చు పెట్టకు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకొని ఇకనైనా బుద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి హితవు పలికారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల కేసులో సంజయ్ పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించడంతో నిజం బయటపడిందన్నారు. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లలో  కట్టె అడ్డం పెట్టొద్దన్నారు.

రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. 20 నెలల్లో నియోజకవర్గానికి ఏమి చేశారని ప్రశ్నించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌, మల్టీ స్పెషాలిటీ కేర్ వంటి పనులు విధానపరమైన అభివృద్ధి మాత్రమేనన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయించానన్నారు. టీయూఐడీసీ నిధులు గత ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాల, స్పెషల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఉపాధి హామీ పథకాల కింద రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

మున్సిపాలిటీలో కమిషనర్ల బదిలీలు, అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే పాలనకు నిదర్శనమన్నారు. యావర్ రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, బండ శంకర్, మోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.