బీఆర్ఎస్ లోకి జీవన్రెడ్డి.. ఏప్రిల్ 27న చేరే అవకాశం

బీఆర్ఎస్ లోకి జీవన్రెడ్డి.. ఏప్రిల్  27న  చేరే అవకాశం
  •   ఇంటికెళ్లి ఆహ్వానించిన కేటీఆర్​
  •     జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తామని వెల్లడి

జగిత్యాల, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం జగిత్యాలలో జీవన్​రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.తన ఇంటికొచ్చి ఆహ్వానించిన కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపిన జీవన్​రెడ్డి రెండుమూడు రోజుల్లో తన నిర్ణయాన్ని చెప్తానన్నారు. అయితే ఈ నెల 27న ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ శిబిరంలో చేరడం ఖరారయ్యిందని పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి గౌరవమైన స్థానం కల్పిస్తామని కేటీఆర్ చెప్పారు. జీవన్​రెడ్డిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవన్ రెడ్డితో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు నాలుగు దశాబ్దాలుగా వ్యక్తిగత స్నేహం ఉందని, ఇరువురి మధ్య పరస్పర గౌరవం కొనసాగుతోందని అన్నారు. జీవన్ రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా జీవన్​రెడ్డిని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారని, బోర్నపల్లిలో వంతెన నిర్మించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, వెంటనే కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. ఆయన రెండు మూడు రోజుల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి తుది నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు.  కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సంజయ్, కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రెండేళ్లలో తిరోగమనం

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రోజు భావోద్వేగానికి గురయ్యానని, నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టడం బాధ కలిగించిందని జీవన్​రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ తాను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను వీడతానని ఊహించలేదన్నారు. గత ఇరవై నెలలుగా మానసిక వేదన, అవమానాలను తట్టుకుని నిలబడ్డానన్నారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు అనేక ప్రభుత్వాలను చూశానని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయని అన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి రెండేళ్లలో తిరోగమన దిశగా సాగుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు కేటీఆర్ రావడంతో జీవన్ రెడ్డి ఇంటి ఆవరణలోకి ఒక్కసారిగా కార్యకర్తలు చొచ్చుకువచ్చారు. వారు అక్కడున్న మీడియా ప్రతినిధులపై పడటంతో కెమెరాలు, ఎక్విప్మెంట్ ధ్వంసం అయ్యాయి.. పలువురు స్వల్పంగా గాయపడ్డారు.